IPL Auction 2022: 'డైనమైట్'లా పేలిన ఇషాన్! ఐపీఎల్‌లో ఖరీదైన 4వ ఆటగాడు! MI యుద్ధమే చేసింది!
IPL Mega Auction 2022: ఇషాన్ రికార్డు సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్ వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడి చరిత్ర లిఖించాడు. ముంబయి ఇండియన్స్ అతడి కోసం రూ.15.25 కోట్లు వెచ్చించింది.
![IPL Auction 2022: 'డైనమైట్'లా పేలిన ఇషాన్! ఐపీఎల్‌లో ఖరీదైన 4వ ఆటగాడు! MI యుద్ధమే చేసింది! IPL Mega Auction 2022 Ishan Kishan becomes most expensive 4th player in ipl history IPL Auction 2022: 'డైనమైట్'లా పేలిన ఇషాన్! ఐపీఎల్‌లో ఖరీదైన 4వ ఆటగాడు! MI యుద్ధమే చేసింది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/0e3520096a406481bbc444a8e3876aa1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL Mega Auction 2022: టీమ్‌ఇండియా చిచ్చర పిడుగు, ఝార్ఖండ్ డైనమైట్ ఇషాన్ రికార్డు సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్ వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడి చరిత్ర లిఖించాడు. ముంబయి ఇండియన్స్ అతడి కోసం రూ.15.25 కోట్లు వెచ్చించింది. ఫ్రాంచైజీల వద్ద తక్కువ డబ్బే ఉండటం, పూర్తి జట్టును నిర్మించుకోవాల్సి రావడంతో ఈ సీజన్లో ఇంతకన్నా ఎక్కువ ధర మరొకరికి దక్కకపోవచ్చు!
వేలం గదిలో Ishan Kishan క్రేజ్
వేలంలో ఇషాన్ కిషన్ పేరు రాగానే ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు ఆసక్తి ప్రదర్శించారు. క్షణాల్లోనే అతడి ధర రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరుకుంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోటీపడ్డాయి. మరికాసేపటికే అతడి ధర రూ.7 కోట్లు దాటేసింది. ఈ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం వారికి పోటీగా వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు బిడ్లు వేయడంతో కిషన్ ధర రూ.12 కోట్లు దాటేసింది. అక్కడితో పంజాబ్ వదిలేసినా ముంబయి, హైదరాబాద్ ఆఖరి వరకు పోటీ పడ్డాయి. రూ.15 కోట్ల వరకు సన్‌రైజర్స్ ఆసక్తి ప్రదర్శించింది. ముంబయి మరో రూ.25 లక్షలు బిడ్ వేయడంతో రూ.15.25 కోట్లతో దక్కించుకుంది.
ముంబయికి Ishan Kishan ఎందుకు కీలకం
ఇషాన్ కిషన్ కోసం ముంబయి ఇండియన్స్ ఇంతగా పోటీ పడేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఈ కుర్రాడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. జట్టుకు కనీసం 12-15 ఏళ్లు సేవలు అందించగలడు. టాప్ ఆర్డర్లోనే ఆడతాడు. వికెట్ కీపింగ్ చేస్తాడు. ఎడమచేతి వాటం కావడం మరో అదనపు సానుకూల అంశం. నిజానికి ముంబయి అతడిని రీటెయిన్ చేసుకోవాలని భావించింది. కుదరకపోవడంతో కొత్త జట్ల వద్దకు వెళ్లొద్దని చెప్పింది! వేలంలో ఎంతకైనా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. దాంతో అతడు వేలంలోకి వచ్చాడు.
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇప్పుడు ముంబయికి ఓపెనింగ్ చేస్తారు. కుడిఎడమ కూర్పు కాబట్టి ప్రత్యర్థులకు బౌలింగ్ చేయడం కష్టమవుతుంది. అంతేకాకుండా రోహిత్ మొదట్లో ఆచితూచి ఆడతాడు. అదే సమయంలో కిషన్ అంతర్‌వృత్తం అవతలికి బంతులను పంపిచేస్తాడు. అరగంటలోనే 40-50 పరుగులు చేసేస్తాడు. ఏ జట్టైనా కోరుకొనేది ఇదే. అందుకే ముంబయి అంత మూల్యం చెల్లిస్తోంది.
నాలుగో ఆటగాడు
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. గతేడాది వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లు పలికాడు. 2015లో యువరాజ్ సింగ్ రూ.16 కోట్లు అందుకున్నాడు. 2020లో ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.15.5 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు కిషన్ కోసం ముంబయి రూ.15.25 కోట్లు చెల్లిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)