IPL, DC: దిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ స్టాఫ్ ప్రక్షాళన! అగార్కర్‌కు ప్రమోషన్.. రికీ, దాదా భవితవ్యం ఏంటి?
IPL, DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ముగిసి నెలరోజులైనా కాలేదు! దిల్లీ క్యాపిటల్స్ అప్పుడే వచ్చే సీజన్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టింది. సపోర్ట్ స్టాప్‌లో కీలక మార్పులు చేస్తోంది.
IPL, DC:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ముగిసి నెలరోజులైనా కాలేదు! దిల్లీ క్యాపిటల్స్ అప్పుడే వచ్చే సీజన్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టింది. సపోర్ట్ స్టాప్‌లో కీలక మార్పులు చేస్తోంది. అయితే రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ ద్వయాన్ని అలాగే కొనసాగించనుంది. అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న అజిత్ అగార్కర్ మరో పెద్ద పదవిని ఇస్తారని తెలిసింది. ఇక ఆటగాళ్లలోనూ చాలామందిని వదిలేసే అవకాశం ఉంది. ఈ మేరకు డీసీ ఓనర్ పార్థ్ జిందాల్ అప్‌డేట్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2023లో దిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఘోరంగా మారింది. కనీసం ప్లేఆఫ్ చేరుకుంటుందని భావించినా అంచనాలను అందుకోలేకపోయింది. ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. 14 మ్యాచులు ఆడి ఐదు మ్యాచులు గెలిచి తొమ్మిది ఓడింది 10 పాయింట్లు, -0.808 రన్‌రేట్‌తో తొమ్మిదో ప్లేస్‌కు పరిమితమైంది. తీసుకున్న ఆటగాళ్లు రాణించకపోవడం, వ్యూహాల అమల్లో లోపాలు వారిని వెనక్కి నెట్టాయి. డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా బ్యాటింగ్‌లో ఎవరూ నిలకడగా రాణించలేదు. బౌలింగ్‌లోనూ ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ రిషభ్ పంత్ లేకపోవడం ఎంతైనా చేటు చేసింది. అతడు మిడిలార్డలో జట్టును సమర్థంగా ముందుకు నడిపించేవాడు. ఒంటిచేత్తో సిక్సర్లు బాదేసి మ్యాచ్ గమనం మార్చేసేవాడు.
వ్యూహాలు రచించడం, అమలు చేయడంతో మరింత స్పష్టత రావడం కోసం సపోర్ట్ స్టాఫ్‌లో కొందరిని తగ్గిస్తున్నారని తెలిసింది. అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్‌ను పంపించేస్తారని సమాచారం. 'వచ్చే ఐపీఎల్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఇప్పట్నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టింది. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ నేతృత్వంలోనే మార్పులు చేపడుతున్నాం. జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు చేయాల్సిన పనులపై నేను, కిరన్ గ్రాంధి (సహ యజమాని) కఠోరంగా పనిచేస్తున్నాం' అని డీసీ యజమానుల్లో ఒకరైన పార్థ్ జిందాల్ ట్వీట్ చేశారు.
రెండేళ్లుగా అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న అజిత్ అగార్కర్‌కు మరో పెద్ద పదవిని అప్పగిస్తారని సమాచారం. జట్టును మరింత పటిష్ఠంగా మార్చేందుకు ప్రవీణ్ ఆమ్రె సేవలను మరింతగా ఉపయోగించుకోనుంది. 'షేన్ వాట్సన్, హోప్స్ స్థానాల్లో ఇతరులను తీసుకోవాలని అనుకోవడం లేదు. మరింత స్పష్టం రావడం కోసం సపోర్ట్ స్టాఫ్‌ను తగ్గిస్తున్నారు. 2015 నుంచి ప్రవీణ్ ఆమ్రె పనిచేస్తున్నాడు. యువకులను తీర్చిదిద్దాడు. జట్టును పునర్ నిర్మించేందుకు మళ్లీ అతడికి స్వేచ్ఛను ఇవ్వనున్నారు. 2019, 2022లో దిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టడానికి పాంటింగ్, ఆమ్రెనే కారణం' అని ఫ్రాంచైజీ వర్గాలు మీడియాకు తెలిపాయి.