Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
IMD Alert: ఫెంగల్ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని.. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటలు పడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
IMD Red Alert For Coastal Areas Of AP And Tamilnadu: 'ఫెంగల్' తుపాను (Fengal Cyclone) పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. మహాబలిపురం - కరైకాల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటలు పట్టే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీల వేగంతో కదిలిన తుపాను శనివారం రాత్రి 11:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో తిరుపతి (Tirupati), నెల్లూరు (Nellore), ప్రకాశం జిల్లాల్లో తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. దాదాపు 20 సెం.మీ వర్షపాతంతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సూచించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అటు, చెన్నై, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విమానాల రాకపోకలు బంద్
అటు, తుపాను ప్రభావంతో చెన్నైవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నుంచి చెన్నై వెళ్లే పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై - విశాఖ - చెన్నై, తిరుపతి - విశాఖ - తిరుపతి విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 3 విమానాలు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలు రద్దు చేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై ఎయిర్‌పోర్టును (Chennai Airport) మూసేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకూ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను నిలిపేసినట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబు సమీక్ష
మరోవైపు, తుపాను హెచ్చరికలతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో చర్చించారు. అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.