IPL 2024 CSK vs GT: చెన్నై-గుజరాత్ మ్యాచ్, గత రికార్డులు ఏం చెప్తున్నాయ్?
Chennai Super Kings vs Gujarat Titans: ఐపీఎల్‌లో ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
IPL 2024 CSK vs GT Head to Head Records: ఐపీఎల్(IPL)లో ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(CSK)- గుజరాత్ టైటాన్స్(GT) తలపడనున్నాయి. 2023 ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై.. 2022 ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత ఏడాది ఫైనల్లోనూ ఈ రెండు జట్లు తలపడాయి. అప్పుడు గుజరాత్‌ను ఓడించి టైచిల్ ఒడిసిపట్టిన చెన్నై.. మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే చెన్నైపై ప్రతికారం తీర్చుకోవాలని గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది. బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో చెన్నై ఆధిపత్యం చెలాయించినా... మరో విజయం నమోదు చేయాలంటే రుతురాజ్ సేన ప్రదర్శనను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు ఎవరూ 37 పరుగులను దాటలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించింది, చివరి 13 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టి వారు విజయం సాధించారు. 2023 ఫైనల్‌లో పరాజయం పాలైన తర్వాత చెన్నైపై గెలిచి ప్రతీకారం తీసుకోవాలని టైటాన్స్ భావిస్తోంది.
పిచ్ రిపోర్ట్:
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్ పిచ్ మెరుగ్గా ఉంది. బెంగళూరు, చెన్నై బ్యాటర్లు ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ను ఆస్వాదించారు. ఈ పిచ్ మంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బౌలర్లకు కూడా సహకారం అందించనుంది. పేస్ బౌలర్లు వైవిధ్యం ప్రదర్శిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
గత రికార్డులు
ఐపీఎల్‌లో గుజరాత్-చెన్నై ఇప్పటివరకూ అయిదుసార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్‌దే కాస్త పైచేయిగా ఉంది. ఈ మ్యాచుల్లో గుజరాత్ మూడుసార్లు విజయం సాధిస్తే... చెన్నై రెండుసార్లు విజయం సాధించింది.
కీలకం వీరే:
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో రుతురాజ్ గైక్వాడ్ కీలకంగా ఉన్నాడు. ఓపెనర్‌గా మునుపటి సీజన్‌లో రుతురాజ్ నిలకడగా రాణించాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మంచి ఆరంభమే దక్కినా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో రుతురాజ్ విఫలమయ్యాడు. గుజరాత్‌లో రషీద్ ఖాన్ కీలకంగా మారనున్నాడు. అత్యుత్తమ బౌలర్‌లలో ఒకడైన రషీద్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే చెన్నైకు తిప్పలు తప్పవు. ఇటీవలి కాలంలో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటర్లు అతని స్పెల్‌ను జాగ్రత్తగా ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అతను వికెట్లు తీయడానికి రషీద్ కష్టపడుతున్నాడు. మరోవైపు ముంబైతో మ్యాచ్‌లో గెలిచిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు భారీ స్కోరు చేయడంలో విఫలం కావడం గుజరాత్‌ను ఆందోళన పరుస్తోంది. గిల్, వృద్ధిమాన్ సాహా భారీ స్కోర్లు చేయాలని గుజరాత్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాలు తమ ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. చెన్నైలో జన్మించిన క్రికెటర్ సాయి సుదర్శన్‌పై గుజరాత్ భారీ ఆశలు పెట్టుకుంది. నెమ్మదిగా ఉండే చెపాక్ పిచ్‌పై రషీద్ ఖాన్, సాయి కిషోర్ కీలక పాత్ర పోషిస్తారు.