RCB Green Jersey: ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ఎలా తయారు చేస్తారో తెలుసా - కొన్ని టన్నులతో ఎంతో కష్టపడి!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రీన్ జెర్సీ వెనుక పెద్ద కథే ఉంది. స్టేడియంలో ఉన్న చెత్త అంతా సేకరించి ఆ వ్యర్థాలతో జెర్సీని తయారు చేస్తారు.
RCB Green Jersey: IPL 16వ సీజన్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఏడో లీగ్ మ్యాచ్‌లో తమ సాంప్రదాయ ఎరుపు రంగు జెర్సీకి బదులుగా ఆకుపచ్చ జెర్సీని ధరించి మైదానంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ టాస్ వేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు మొక్కను అందించడంతో పాటు పర్యావరణంపై అందరికీ అవగాహన కల్పించాలని సందేశం ఇచ్చాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2011 నుంచి ప్రతి సీజన్లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతుంది. ఈసారి ఏప్రిల్ 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో ఈ జెర్సీతో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నారు. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీని స్టేడియంలో సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా తయారు చేశారు.
స్టేడియంలో ఉన్న చెత్త గురించి చెప్పాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడినప్పుడు స్టేడియంలో మొత్తం 19,488 వాటర్ బాటిళ్లతో సహా 9047.6 కిలోల చెత్త పోగయింది. సుమారు 8 టన్నుల పొడి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, ఇతర పదార్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఈ జెర్సీలను తయారు చేశారు.
గ్రీన్ జెర్సీలో దారుణమైన రికార్డులు
రాయల్ ఛాలెంజర్స్ జట్టు 2011 సీజన్ నుండి ఇప్పటివరకు ఆకుపచ్చ జెర్సీని ధరించి మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూసింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు.
Lookin’ fresh and oh so clean,
— Royal Challengers Bangalore (@RCBTweets) April 13, 2023
For the right cause, we wear GREEN! 👊🟢
How cool are the #RCBxPuma kits for the Go Green game, 12th Man Army? 🤩#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #GoGreen @pumacricket pic.twitter.com/uRRurfqMWk
ఈ మ్యాచ్‌లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తప్ప ఇంకెవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో చెత్త ప్రదర్శన కనబరిచారు. కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయారు.
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే వారికి మొదటి బంతికే భారీ షాక్ తగిలింది. ఫాంలో ఉన్న కెప్టెన్, ఓపెనర్ విరాట్ కోహ్లీను (0: 1 బంతి)మొదటి బంతికే ట్రెంట్ బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్‌ను (2: 4 బంతుల్లో) కూడా బౌల్ట్ తన తర్వాతి ఓవర్లోనే అవుట్ చేశాడు. దీంతో బెంగళూరు 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
అక్కడ నుంచి ఓపెనర్ ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మాస్ ర్యాంపేజ్ మొదలయింది. ఏ దశలోనూ రన్‌రేట్ 10కి పడిపోకుండా వీరు అద్భుతంగా ఆడారు. వీరి ధాటికి పవర్ ప్లేలో ఆర్సీబీ 62 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరి జోరు తగ్గలేదు. 10 ఓవర్లకు స్కోరు 101 పరుగులకు తీసుకెళ్లారు. ఇద్దరూ అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 127 పరుగులు జోడించిన అనంతరం లేని పరుగుకు ప్రయత్నించి ఫాఫ్ డుఫ్లెసిస్ రనౌటయ్యాడు. కాసేపటికే మ్యాక్స్‌వెల్ కూడా అశ్విన్ బౌలింగ్‌లో స్విచ్ హిట్‌కు ప్రయత్నించి హోల్డర్ చేతికి చిక్కాడు. అప్పటికి స్కోరు 15 ఓవర్లలో 155 పరుగులకు చేరుకుంది.
మ్యాక్స్‌వెల్ అవుటయ్యాక ఆర్సీబీ పూర్తిగా తడబడింది. చివరి ఐదు ఓవర్లలో 33 పరుగులు మాత్రమే చేసింది. మహిపాల్ లొమ్రోర్ (8: 6 బంతుల్లో, ఒక ఫోర్), దినేష్ కార్తీక్ (16: 13 బంతుల్లో), వనిందు హసరంగ (6: 7 బంతుల్లో) వేగంగా ఆడలేకపోయారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులకు పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు.రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లకు చెరో వికెట్ దక్కింది.