IPL 2023: ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్, ఫాఫ్ - పర్పుల్ క్యాప్ కోసం గట్టి పోటీ!
ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌ల కోసం గట్టి పోటీ నెలకొంది.
IPL 2023 Orange And Purple Cap Race: IPL 2023 రెండో సగం మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆరెంజ్, పర్పుల్ క్యాప్ కోసం చాలా మంది ఆటగాళ్ల మధ్య ఆసక్తికరమైన యుద్ధం జరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్ అందిస్తారు.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధిక పరుగుల స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఆరెంజ్ క్యాప్ కోసం గట్టిగా పోటీ పడుతున్నాడు. పర్పుల్ క్యాప్ కోసం మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ మధ్య గట్టి పోరు ఉంది.
డు ప్లెసిస్ ముందంజలో
IPL 2023 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం ఫాఫ్ డు ప్లెసిస్ దగ్గర ఉంది. లీగ్ 16వ సీజన్‌లో అతను అత్యధికంగా 422 పరుగులు చేశాడు. అతను ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఐదు అర్ధశతకాలు సాధించాడు. కానీ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ కోసం జోరును పెంచాడు. 333 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ కూడా ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ 333 పరుగులతో, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన 322 పరుగులతో, అదే జట్టుకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ 317 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు.
పర్పుల్ క్యాప్ రేసులో ఈ ఆటగాళ్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 14 వికెట్లు తీశాడు. అతను ప్రస్తుతం పర్పుల్ క్యాప్‌ని కలిగి ఉన్నాడు. అయితే ఇతనికి రషీద్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ముగ్గురు బౌలర్లు కూడా ఇప్పటి వరకు తలో 14 వికెట్లు తీశారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి కూడా పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇతను ఈ టోర్నీలో 13 వికెట్లు తీశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 56 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సులువుగా ఛేదించేదేమో అనిపించింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే విరాట్ కోహ్లీ 56 పరుగుల ఇన్నింగ్స్‌తో మరో పెద్ద మైలురాయిని అందుకున్నాడు.
ఈ సీజన్‌లో 300కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. దీంతో పాటు వరుసగా 14 సీజన్లలో 300కి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మాత్రమే. ఈ ఫార్మాట్‌లో తనకు పోటీగా మరో బ్యాట్స్‌మెన్ లేడని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీతో పాటు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌లు చెరో 12 సార్లు ఈ స్థానాన్ని సాధించారు.