IPL 2023: టైటాన్స్ నుంచి ఇద్దర్ని ట్రేడ్ చేసుకున్న కేకేఆర్! ఆర్సీబీ పేసర్ ఇక ముంబయికి!
IPL 2023: ఐపీఎల్ 2023 రీటెన్షన్ జాబితా సమర్పణకు చివరి తేదీ సమీపిస్తుండటంతో ఫ్రాంచైజీలన్నీ బిజీగా కనిపిస్తున్నాయి. తమకు అవసరమైన ఆటగాళ్లను ఇతర జట్ల నుంచి ట్రేడ్ చేసుకుంటున్నాయి.
IPL 2023: ఐపీఎల్ 2023 రీటెన్షన్ జాబితా సమర్పణకు చివరి తేదీ సమీపిస్తుండటంతో ఫ్రాంచైజీలన్నీ బిజీగా కనిపిస్తున్నాయి. తమకు అవసరమైన ఆటగాళ్లను ఇతర జట్ల నుంచి ట్రేడ్ చేసుకుంటున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రెండు సార్లు విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ కొందరు క్రికెటర్లను తీసుకున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇద్దరు ఆటగాళ్లను తీసుకుంది. న్యూజిలాండ్ స్పీడ్‌గన్, 150 కి.మీ వేగంతో బంతులేసే లాకీ ఫెర్గూసన్‌ను తిరిగి తెచ్చుకుంది. అఫ్గానిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్బాజ్‌ను ఎంచుకుంది. వీరిద్దరినీ నగదు చెల్లించే తీసుకున్నారని సమాచారం. అయితే ఎంత ఖర్చు చేశారన్నది తెలియలేదు.
ఫెర్గూసన్ 2019 నుంచి 2021 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ఆడాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్తుతో, అద్భుతమైన పేస్‌తో వికెట్లు అందించేవాడు. అయితే గతేడాది అతడిని తన కనీస ధరకు 5 రెట్లు రూ.10 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. అందుకు తగ్గట్టే అతడు 13 మ్యాచుల్లో 8.95 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. 4/27తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఫైనల్లో 157.3 కిలోమీటర్ల వేగంతో జోస్ బట్లర్‌కు బంతి వేశాడు. కేకేఆర్‌లో ప్యాట్ కమిన్స్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావికి అతడు తోడుగా ఉండనున్నాడు.
View this post on Instagram
అఫ్గానిస్థాన్ కీపర్ గుర్బాజ్ కేకేఆర్‌కు మరిన్ని వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఇవ్వనున్నాడు. ఎందుకంటే గతేడాది ఈ విభాగంలో ఆ జట్టు తడబడింది. ఎందుకంటే సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, బాబా ఇందర్‌జిత్ పెద్దగా సాయపడలేదు. గతేడాది వేలంలో అమ్ముడవ్వని గుర్బాజ్‌ను రూ.50లక్షలు చెల్లించి గుజరాత్ తీసుకుంది. కానీ ఒక్క మ్యాచులోనూ అవకాశం ఇవ్వలేదు. పీఎస్‌ఎల్, సీపీఎల్, బీపీఎల్, ఎల్‌పీఎల్, అబుదాబి టీ10 లీగ్‌లో అతడికి అనుభవం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ జేసన్ బెరెన్‌డార్ఫ్‌ను ముంబయి ఇండియన్స్ తీసుకుంది. రూ.75 లక్షలకే తీసుకున్నా ఆర్సీబీ ఒక్క మ్యాచులోనూ అవకాశం ఇవ్వలేదు. పేస్ బౌలింగ్ ఆప్షన్లు తక్కువగా ఉండటంతో ముంబయి అతడిని ఎంచుకుంది.
View this post on Instagram