Kohli Meets Sachin: సచిన్‌ను కలిసి మురిసిన కోహ్లీ! ముంబయి కుర్రాళ్లకు సలహాలు
Virat Kohli meets Sachin: ముంబయి ఇండియన్స్ పై విజయం తర్వాత ఆర్‌సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) సచిన్ తెందూల్కర్‌ను (Sachin Tendulkar) కలిశాడు.
Virat Kohli meets Sachin Tendulkar: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) దూసుకుపోతోంది. ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)పై శనివారం అద్భుత విజయం అందుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) ముంబయి ఇండియన్స్ మెంటార్ సచిన్ తెందూల్కర్‌ను (Sachin Tendulkar) కలిశాడు. ఆయనతో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ముంబయి కుర్రాళ్లతో ముచ్చటించాడు. విలువైన సలహాలు ఇచ్చాడు.
సచిన్ తెందూల్కర్ అంటే విరాట్ కోహ్లీకి ఎంతో ఆరాధనా భావం. ఆయన్ను ఐడల్‌గా భావిస్తాడు. ఆయన ఆటను చూసే క్రికెట్లోకి వచ్చాడు. మైదానంలో ఎన్నోసార్లు సచిన్‌కు నీరాజనాలు అర్పించాడు. ఎప్పుడు కలిసే అవకాశం వచ్చినా వదులుకోడు. వెంటనే ఆయన వద్దకు పరుగెత్తుకు వెళ్తాడు. ముంబయి మ్యాచ్‌లో 48 పరుగులు చేసిన కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిశాక సచిన్‌ను కలిసి మాట్లాడాడు. ఇదే విషయాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. 'మిమ్మల్ని చూడటం నాకెప్పుడూ ఆనందంగా అనిపిస్తుంది పాజీ' అని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ముంబయి ఇండియన్స్‌లోని కుర్రాళ్లతో కోహ్లీ ముచ్చటించాడు. తిలక్ వర్మ వంటి క్రికెటర్లకు కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడు.
MIపై RCB ఛేదన ఎలా సాగిందంటే
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ముంబై ఇండియన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అదరగొట్టిన అనూజ్...
152 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరు ఇన్నింగ్స్ కూడా మెల్లగానే మొదలైంది. అనూజ్ రావత్ (66: 47 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (16: 24 బంతుల్లో, ఒక ఫోర్) జాగ్రత్తగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అయితే మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఫాఫ్ డుఫ్లెసిస్‌ను అవుట్ చేసి ఉనద్కత్ ముంబైకి మొదటి వికెట్ అందించాడు.
అనంతరం విరాట్ కోహ్లీ (48: 36 బంతుల్లో, ఐదు ఫోర్లు), రావత్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ ముంబై ఇండియన్స్ బౌలర్లకు అస్సలు ఒక్క చాన్స్ కూడా ఇవ్వలేదు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూజ్ రావత్ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 52 బంతుల్లోనే 80 పరుగులు జోడించిన అనంతరం అనూజ్ రావత్ రనౌటయ్యాడు. విజయానికి ఎనిమిది పరుగులు కావాల్సిన దశలో విరాట్ కోహ్లీని డెవాల్డ్ బ్రెవిస్ అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో బౌలింగ్ చేసిన మొదటి బంతికే బ్రెవిస్ వికెట్ తీసుకోవడం విశేషం. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (8 నాటౌట్: 2 బంతుల్లో, రెండు ఫోర్లు), దినేష్ కార్తీక్ (7 నాటౌట్: 2 బంతుల్లో, ఒక సిక్సర్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.
Always a pleasure to see you paji. ⭐🐐@sachin_rt pic.twitter.com/SrOIXW9hl2
— Virat Kohli (@imVkohli) April 10, 2022
View this post on Instagram