(Source: ECI/ABP News/ABP Majha)
SRH vs RR Highlights: 'RRR' రేంజులో సంజూ 'RR' హిట్టు! బ్యాటింగ్, బౌలింగ్‌లో SRH అట్టర్ ఫ్లాప్!
IPL 2022, SRH vs RR: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) రోరింగ్ స్టార్ట్ లభించింది! సీజన్ ఐదో మ్యాచులో 61 పరుగుల తేడాతో ఊహించని విజయం అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను (Sunrisers Hyderabad) చిత్తుగా ఓడించింది.
IPL 2022, SRH vs RR Match Highlights: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) రోరింగ్ స్టార్ట్ లభించింది! సీజన్ ఐదో మ్యాచులో 61 పరుగుల తేడాతో ఊహించని విజయం అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను (Sunrisers Hyderabad) చిత్తుగా ఓడించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టును 149/7కే పరిమితం చేసింది. అయిడెన్ మార్‌క్రమ్ (57; 41 బంతుల్లో 5x4, 2x6), వాషింగ్టన్ సుందర్ (40; 14 బంతుల్లో 5x4, 2x6), రొమారియో షెఫర్డ్ (24; 18 బంతుల్లో 2x6) టాప్ స్కోరర్లు. అంతకు ముందు రాజస్థాన్‌లో సంజు శాంసన్ (55; 27 బంతుల్లో 4x4, 2x6), దేవదత్ పడిక్కల్ (41; 29 బంతుల్లో 4x4, 3x6), షిమ్రన్ హెట్‌మైయిర్ (32; 13 బంతుల్లో 2x4, 3x6) దంచికొట్టారు.
ట్రెంట్, ప్రసిద్ధ్ బౌలింగ్‌కు SRH విలవిల
అసలే భారీ లక్ష్యం! దాంతో SRH ఎలా ఆడుతుందోనని అందరికీ ఆందోళనే! ఇక బ్యాటర్లు తమకు అందించిన దన్నుతో రాజస్థాన్ బౌలర్లు రెచ్చిపోయారు. సరైన లెంగ్తుల్లో బంతులు వేస్తూ ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్‌ను లేపేశారు. 3 వద్ద కేన్ విలియమ్సన్ (2), 7 వద్ద రాహుల్ త్రిపాఠి (0)ను ప్రసిద్ధ్ ఔట్ చేశాడు. 9 వద్ద నికోలస్ పూరన్ (0)ను బౌల్ట్ ఔట్ చేశాడు.9-3తో కష్టాల్లో పడిన ఆ జట్టును అశ్విన్, యూజీ సైతం ఉక్కిరి బిక్కిరి చేశారు. యూజీ 3 వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ (2), అబ్దుల్ సమద్ (4), రొమారియో షెఫర్డ్ (24)ను ఔట్ చేశాడు. దాంతో హైదరాబాద్ 78కే 6 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (23 ) కొన్ని షాట్లైతే ఆడాడు కానీ అవి విజయానికి సరిపోలేదు. 17వ ఓవర్లో వరుసగా 6, 4, 4, 2, 4, 4తో అలరించాడు. అయిడెన్ మార్క్‌క్రమ్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు.
RR, Sanju పరుగుల పండుగ
పిచ్ చూస్తే పచ్చికతో మెరుస్తోంది! సన్‌రైజర్స్ బౌలర్లు పండగ చేసుకుంటారని అనుకున్నారు! అలాగే భువీ అద్భుతంగా బౌలింగ్ ఆరంభించాడు. తొలి ఓవర్లోనే జోస్ బట్లర్‌ను (35; 28 బంతుల్లో 3x4 3x6) ఔట్ చేశాడు. అది నో బాల్‌గా తేలడంతో అసలు కథ మొదలైంది. తొలి మూడు ఓవర్లు నిలకడగా ఆడిన బట్లర్, యశస్వీ జైస్వాల్ (20; 16 బంతుల్లో 2x4, 1x6) జోడీ వీర బాదుడు మొదలు పెట్టారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 58 పరుగుల భాగస్వామ్యం అందించారు. 58 వద్ద జైస్వాల్, 75 వద్ద బట్లర్ ఔటయ్యారు.
అప్పుడే వచ్చిన సంజు శాంసన్ కొట్టాడు సామీ! ఎంత చెప్పినా తక్కువే! నిలబడి మరీ సిక్సర్లు దంచాడు. బ్యాక్‌ఫుట్‌లో అతడు కొట్టిన బౌండరీలకు పరుగెత్తలేక హైదరాబాద్ బౌలర్లు, ఫీల్డర్లు అలసిపోయారు. మరోవైపు దేవదత్ పడిక్కల్ మిడిలార్డర్‌లో కనబరిచిన దూకుడుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బౌలర్లను ఉతికి ఆరేశాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 73 పరుగుల భాగస్వామ్యం అందించారు. 148 వద్ద అతడు ఔటయ్యాక సంజు హాఫ్ సెంచరీ చేశాడు. ఇది అతడి 100వ ఐపీఎల్ మ్యాచ్. 16.1వ బంతికి భారీ షాట్ ఆడబోయిన అతడిని భువీ ఔట్ చేశాడు. అక్కడితోనూ పరుగుల వరద ఆగలేదు. రియాన్ పరాగ్ (12)తో కలిసి హెట్‌మైయిర్ (32; 13 బంతుల్లో 2x3, 3x6) సిక్సర్లు, బౌండరీలు కొట్టి స్కోరును 210/6కి తీసుకెళ్లాడు.
Hum jeet gaye! 💗 pic.twitter.com/LbzRm7zJ5Y
— Rajasthan Royals (@rajasthanroyals) March 29, 2022