GT Vs MI: ఆరంభం అదిరినా చివర్లో చెదిరిన ముంబై - గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తన ఇన్నింగ్స్ ఆఖరిలో తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (45: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో పరుగులు కావాలి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (43: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 7.3 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (44 నాటౌట్: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మినహా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. తిలక్ వర్మ (21: 16 బంతుల్లో, రెండు ఫోర్లు)... డేవిడ్‌కు కాసేపు సహకారం అందించాడు.
చివర్లో టిమ్ డేవిడ్ సిక్సర్లతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఇండియన్స్ 57 పరుగులు సాధించడం విశేషం. ఓపెనర్లు మెరుపు ఆరంభం అందించాక ముంబై 200 స్కోరును అందుకునేలా కనిపించింది. కానీ సూర్య కుమార్ యాదవ్ (13: 11 బంతుల్లో, ఒక సిక్సర్), కీరన్ పొలార్డ్ (4: 14 బంతుల్లో), డేనియల్ శామ్స్ (0: 2 బంతుల్లో) విఫలం కావడంతో ముంబై ఇండియన్స్ ఆ మార్కును సాధించలేకపోయింది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.
View this post on Instagram