RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ (93: 57 బంతుల్లో, 13 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ విజయానికి 120 బంతుల్లో 151 పరుగులు కావాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి మెరుపు ఆరంభం లభించింది. ఫాంలో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మొదటి ఓవర్లోనే అవుటైనా... తర్వాత వచ్చిన మొయిన్ అలీ చెలరేగిపోయాడు. మొదటి బంతి నుంచి విరుచుకు పడ్డాడు. ముఖ్యంగా బౌల్ట్ వేసిన ఆరో ఓవర్లో ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు మగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టానికి ఏకంగా 75 పరుగులు చేసింది.
అయితే ఆ తర్వాత చెన్నైకి కష్టాలు మొదలయ్యాయి. డెవాన్ కాన్వే, జగదీషన్, అంబటి రాయుడు 10 పరుగుల తేడాతో అవుటయ్యారు. దీంతో ధోని, మొయిన్ అలీ నిదానించారు. చివర్లో కూడా రాజస్తాన్ బౌలర్లు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా టైట్ బౌలింగ్ వేశారు. వేగంగా పరుగులు చేసే క్రమంలో మొయిన్, ధోని కూడా అవుటయ్యారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులకు పరిమితం అయింది.
మొదటి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసిన చెన్నై, తర్వాత 14 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్తాన్ బౌలర్లలో చాహల్, మెకాయ్ రెండేసి వికెట్లు తీశారు. బౌల్ట్, ప్రసీద్ కృష్ణలకు చెరో వికెట్ దక్కింది.
View this post on Instagram