Google's 2024 search trend: భారత్-పాక్ పోరు లైట్ తీసుకున్న ఫ్యాన్స్.. ఈ ఏడాది అత్యధికంగా ఏ మ్యాచ్ గురించి సెర్చ్ చేశారో తెలుసా..?
Ind Vs pak :ఈ ఏడాది జరిగిన క్రికెట్ మ్యాచ్ ల్లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన మ్యాచ్ గురించి గూగుల్ తాజాగా వెల్లడించింది. ఆశ్చర్యకరంగా పాక్ తో పోరును భారతీయులు లైట్ తీసుకున్నారు.
IPL 2025 News: సాధారణంగా దాయదులు భారత్, పాకిస్థాన్ ల మధ్య ఏదైనా పోరు ఉందంటే చాలు.. అది ఏ క్రీడ అయినా చాలా ఆసక్తిని కనబరుస్తారు ఇరుదేశాల క్రీడాభిమానులు. ఇక క్రికెట్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు యుద్ధభూమిని తలపించేవి. మైదానంలో ఆడటానికి కాకుండా, పోరాడటానికి వెళుతున్నట్లుగా ఇరుదేశాల క్రికెటర్లు భావించేవారు. ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా కప్పు గెలవకున్నా ఫర్లేదు కానీ, దాయాదుల మధ్య పోరులో తమ దేశమే గెలవాలని కోరుకునేవాళ్లు ఫ్యాన్స్. అయితే క్రికెట్ విషయంలో ఈ విషయానికి కాలం చెల్లిపోయిందని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది టీ20 ప్రపంచకఫ్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. అయితే దాని గురించి కాకుండా ఇంకా వేరే మ్యాచ్ గురించే భారత అభిమానులు అత్యధికంంగా సెర్చ్ చేశారు.
ఇంగ్లాండ్ తో పోరు గురించి..
తాజాగా గూగుల్ ట్రెండ్ ఈ ఏడాదికి సంబంధించిన వివిధ గణంకాలను పబ్లిష్ చేసింది. అందులో క్రికెట్ విషయానికొస్తే భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ విషయంలో అభిమానులు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలిపింది. అయితే అది ఏ ఫార్మాట్, ఏ టోర్నీ అనే దానిపై స్పష్టత లేదు. ఇక భారత్-బంగ్లాదేశ్, భారత్-జింబాబ్వే, భారత్-శ్రీలంక, భారత్-ఆఫ్గనిస్తాన్, భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లు వరుసగా టాప్ -6లో ఉన్నాయి. అంటే పాక్ తో పోరు కంటే కూడా మిగతా మ్యాచ్ లపైనే భారతీయులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, పాక్ ల మధ్య జరిగిన పోరు ఏడో స్థానంలో నిలిచింది.
నిజానికి గత కొంతకాలంగా పాకిస్థాన్ జట్టు ఆటతీరు నానాటికి తీసికట్టుగా మారుతోంది. భారత్ కు సవాల్ విసరడం పక్కన పెట్టి, పసికూనల చేతిలోనూ ఓడిపోతోంది. యూఎస్ఏ, ఐర్లాండ్ చేతిలో అనూహ్య పరాజయాలు పొందిన పాక్.. అత్యంత సాధారణమైన జింబాబ్వే చేతిలో ఓడిపోవడం రివాజుగా మారిపోయింది. సాధారణంగా మిగతా పెద్ద జట్లు జింబాబ్వేతో మ్యాచ్ అంటే లైట్ తీసుకుంటాయి. కానీ, పాక్-జింబాబ్వే జట్ల మధ్య పోరు అంటే సమ ఉజ్జీల మధ్య జరుగుతున్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఈ ఒక్క ఉదాహరణ చెప్పొచ్చు, పాక్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అని. ఇక, గూగుల్ ట్రెండింగ్ విషయానికొస్తే, ఆ తర్వాత వరుసగా పాక్-ఇంగ్లాండ్, ఆర్సీబీ-చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కే-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గురించి ఎక్కువగా భారతీయులు వెతికినట్లు గూగుల్ తెలిపింది.
PTI INFOGRAPHICS | Google’s Year In Search 2024: Top Trending Searches in India (Overall) (n/11) pic.twitter.com/IN1Gi6ZrRM
— Press Trust of India (@PTI_News) December 10, 2024
టోర్నీల్లో ఐపీఎల్ టాప్..
ఈ ఏడాది జరిగిన క్రీడాంశాల్లో ఎక్కువగా వెతకడంతో ఐపీఎల్ నెం.1 ర్యాంకు దక్కించుకుందని గూగుల్ తెలిపింది. దాదాపు రెండున్నర నెలలపాటు జరిగే ఈ టోర్నీ గురించి అభిమానులు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తర్వాతి స్తానాల్లో టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్, ప్రొ కబడ్డీలీగ్, ఇండియన్ సూపర్ లీగ్, విమెన్స్ ప్రీమియర్ లీగ్, కోపా అమెరికా కప్, దులీప్ ట్రోఫీ, యూఫా యూరోకప్, అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలు నిలిచాయి.