CSK vs GT IPL 2024: చెన్నై జైత్రయాత్ర, గుజరాత్ పై ఘన విజయం
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
CSK win by 63 runs against Gujarat Titans: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్(CSK) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె అర్థ సెంచరీతో చెలరేగగా రచీన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ చెరో 46 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్ 37, సాహా 21, మిల్లర్ 21 పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపర్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మన్ తలో రెండు వికెట్లు తీయగా, డారిల్ మిచెల్, పతిరన ఒక్కో వికెట్ పడగొట్టారు.
ముందే భారీ స్కోర్
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది. తొలుత చెరో జీవన దానం లభించడంతో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయారు. అజ్మతుల్లా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో చివరి బంతికి రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో ఉన్న సాయికిషోర్ జారవిడిచాడు. ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లోనూ సాయికిశోర్ మరో క్యాచ్‌ను జారవిడిచాడు. రచిన్ రవీంద్ర బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి స్లిప్‌లో ఉన్న సాయికిషోర్ చేతుల్లో బంతి పడింది. కానీ, అతడు దాన్ని ఒడిసిపట్టలేకపోయాడు. అనంతరం వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేశారు. రచిన్ వరుసగా బౌండరీలు, సిక్సులు బాదాడు. క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన రచిన్ రవీంద్ర... ఎడాపెడా బౌండరీలు బాదతూ గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 5 ఓవర్లకు చెన్నై స్కోరు 58/0 పరుగులకు చేరింది. రచిన్ రవీంద్ర జోరుకు రషీద్ ఖాన్ బ్రేక్ వేశాడు. 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేసి రచిన్ అవుటయ్యాడు. రషీద్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా రచిన్ వెనుదిరిగాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 69/1కు చేరింది. అనంతరం రహానే, రుతురాజ్ స్కోరు బోర్డును నడిపించారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై స్కోరు వంద పరుగులు దాటింది. కానీ కాసేపటికే 12 పరుగులు చేసిన రహాన్ అవుటయ్యాడు. సాయి కిషోర్ వేసిన 11 ఓవర్లో రహానే స్టంపౌటయ్యాడు. క్రీజులోకి రావడంతోనే శివమ్ దూబె రెండు సిక్సర్లు బాదాడు. కానీ 36 బంతుల్లో 46 పరుగులు చేసిన రుతురాజ్ జాన్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 127 పరుగుల వద్ద చెన్నై మూడో వికెట్ కోల్పోయింది.
దూకుడుగా దూబే
తర్వాత కూడా శివమ్ దూబె దూకుడు కొనసాగించాడు. డారిల్ మిచెల్, శివమ్ దూబే మెరుగ్గా రాణించారు. దూబే 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్ 20 బంతుల్లో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ 2, సాయికిశోర్, జాన్సన్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ తీశారు.