CSK IPL Auction 2024: చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముగ్గురు, ఎవరంటే!
CSK IPL Auction 2024: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్14 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఇటీవల న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రను కూడా సొంతం చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఉత్సాహంగా జరుగుతోంది. ఈ వేలంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతుందని అంచనా వేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ హిట్టర్ డారిల్ మిచెల్ కూడా ఒకడు. నిలకడగా ఆడుతూ మంచి స్కోర్లు నమోదు చేస్తుండే మిచెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.అంచనాలకు తగ్గట్టుగానే నేటి ఐపీఎల్ వేలంలో డారిల్ మిచెల్ కు భారీ ధర పలికింది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఎందుకంటే డారిల్ మిచెల్ కనీస ధర రూ.1 కోటి మాత్రమే అయితే పలు ఫ్రాంచైజీలు వేలం పాటను అమాంతం పెంచేశాయి. అయితే తొలి దశలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోయిన చెన్నై రూ.11 కోట్ల పాట వద్ద ఎంటరైన చెన్నై రూ.14 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది.
అలాగే ఇటీవల వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రను కూడా కోటి 80 లక్షలకు సొంతం చేసుకుంది. నిజానికి రచిన్ రవీంద్ర ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అందరూ భావించారు. ఎందుకంటే భారత గడ్డపై జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్ లో రచిన్ రవీంద్ర 3 సెంచరీలు బాది పరుగులు వెల్లువెత్తించాడు. ఈ న్యూజిలాండ్ యువకుడు ICC ప్రపంచ కప్ 2023లో తన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతో, ఐపీఎల్ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోరాడతాయని, తద్వారా కళ్లు చెదిరే ధర వస్తుందని అందరూ ఊహించారు. కానీ అవేవీ జరగలేదు. ఐపీఎల్ మినీ వేలంలో రచిన్ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలు కాగా... అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఆసక్తి చూపించాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బాగా చవకగా రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ వేలంలో రూ.4 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో పడ్డాడు. శార్దూల్ ఠాకూర్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, సీఎస్ కేతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడింది. అయితే అతడిని చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. 2018, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తో రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ఠాకూర్ చివరిసారిగా కోల్ కత్తా నైట్రైడర్స్ తరఫున ఆడాడు. 2023 ఐపీఎల్ ప్రచారం నిరాశపరిచినప్పటికీ, శార్దూల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 29 బంతుల్లో 68 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ ఐపీఎల్ స్కోరును సాధించాడు.
ఐపీఎల్ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఐపీఎల్ పాలకవర్గం మొత్తం ఈ జాబితాను పది ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు.