Flood problems in Asifabad: అసిఫాబాద్ జిల్లాలో ఎటు చూసినా నీళ్లే - తెలంగాణ - మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు
Heavy rains in Asifabad: అసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాళ్ల సాయంతో ప్రజలు వాగులు దాటుతున్నారు.

Adilabad Heavy rains problems: భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో వాగు ఉప్పొంగడంతో రాకపోకలు కూడా సాధ్యం కావడం లేదు. వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం పిప్పర్ గొంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో, విద్యార్థులు, గ్రామస్థులు తాడు సహాయంతో వాగును దాటారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ, తమ అవసరాల నిమిత్తం ఈ సాహసం చేయాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
హుడికిలి వంతెనపైకి వరద నీరు రావడంతో తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ల్లా సిర్పూర్ మండలంలోని హుడికిలి గ్రామ సమీపంలో పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు వంతెనపైకి చేరడంతో, సోమవారం సిర్పూర్ తహశీల్దార్ రహీముద్దీన్ అన్ని రకాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని తెలిపారు. ప్రజలు ప్రయాణం చేయకుండా దారిలో కంచెలు వేసి సిబ్బందిని నియమించారు. నీటిలో మునిగిన వంతెనలను ఎవరూ దాటరాదని, ప్రమాదకర ప్రయత్నాలు చేయవద్దని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని సిర్పూర్ టి మండలంలో హుడికిలి, వెంకట్రావుపేట పొడ్స బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో స్థానిక తహసీల్దార్, DLPO, ఎంపీడీఓలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రవాణాకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పర్యవేక్షణను అధికారులు కొనసాగిస్తున్నారు. దీంతో అధికారుల ఆదేశంతో గ్రామాల్లో డబ్బు చాటింపు కార్యక్రమం చేపట్టారు. వాగులు వరదలు ఉప్పొంగి ప్రవహించే ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని, వాగులు ప్రవహించే వంతెనలు దాటె ప్రయత్నం చేయవద్దనీ, సూచిస్తున్నారు.
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణ కేంద్రాల్లోని రోడ్లన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తూండటంతో వాగులన్నీ ఉప్పొంగుతున్నాయి. బెజ్జూర్ మండలంలోని సుస్మీర్ వాగు ...కారణంగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తలాయి-భీమారం వద్ద బ్యాక్ వాటర్ రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చింతలమానేపల్లి మండలంలోని దిందా- కేతిని, బాబాసాగర్-నాయకపుగూడ వాగులకు వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దహెగాం మండలం ఐనం వద్ద లో లెవల్ వంతెన పైకి వరద రావడంతో దహెగాం-కాగజ్‌నగర్ మధ్య వాహనాలు ఆగిపోయాయి.
కుమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు అయినా కట్టబలహీనంగా ఉండడంతో అధికారులు 5 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూసి మిగతా అంతా దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద వస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.





















