No bail for Mithan Reddy: లిక్కర్ కేసులో నిందితులందరికీ షాక్ - మిథున్ రెడ్డి సహా అందరి బెయిల్ పిటిషన్స్ డిస్మిస్
No Bail : లిక్కర్ కేసు నిందితులందరి బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. మిథున్ రెడ్డి సహా అందరూ జైల్లోనే ఉండనున్నారు.

ACB court dismisses bail pleas of all liquor case accused: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం నిందితులు అందరికీ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. అరెస్టయిన నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మిగిలిన నిందితులలో కొంత మంది విజయవాడ జిల్లా జైలు , ఇద్దరిని గుంటూరు జైల్లో ఉంచారు.
మిథున్ రెడ్డి తో సహా పలువురు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A1), సజ్జల శ్రీధర్ రెడ్డి (A6), కె. ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్ రెడ్డి , గోవిందప్ప బాలాజీ వేసిన బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు ఆగస్టు 12, 2025న ముగిశాయి. తీర్పు ను సోమవారం కోర్టు ప్రకటించింది. అందరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులను సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) గుర్తించింది. వీరిలో 16 మందిపై నేరారోపణలు నమోదు చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. మిథున్ రెడ్డి న్యాయవాదులు, మద్యం విధానంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, కేసు నమోదుకు ఆధారమైన ముగ్గురు సాక్షుల (LW-13, LW-14, LW-71) వాంగ్మూలాల్లో మిథున్ రెడ్డి పాత్ర గురించి ఎక్కడా ప్రస్తావన లేదని వాదించారు. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని కూడా వారు పేర్కొన్నారు. సిట్ న్యాయవాదులు మిథున్ రెడ్డి , ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలుకుబడి కలిగిన వ్యక్తులని, డిస్టిలరీల నుంచి డబ్బులు వసూలు చేశారని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదించారు.
మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కానీ 2025 ఏప్రిల్ 3న హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత, మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు, కానీ 2025 జులై 18న సుప్రీం కోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆయనకు సరెండర్ కోసం సమయం ఇవ్వడానికి కూడా నిరాకరించింది.
లిక్కర్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరింది. ఇప్పటికే ప్రాథమిక చార్జిషీటు తో పాటు.. అనుబంధ చార్జిషీటును దాఖలు చేశారు. ప్రధాన సూత్రాధారి మాజీ సీఎం జగనేనని.. ఆయనే అంతిమ లబ్దిదారు అని సిట్ అనుమానిస్తోంది. ఈ దిశగా దర్యాప్తు జరుపుతోంది.





















