(Source: ECI/ABP News/ABP Majha)
SRH vs CSK, Match Highlights: రైజర్స్ మళ్లీ పాత పాటే.. హైదరాబాద్‌పై ఆరు వికెట్లతో చెన్నై విజయం!
IPL 2021, SRH vs CSK: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత ధోని తన మార్కు సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.
ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచి అభిమానుల్లో ఆశలు రేకెత్తించినా.. అది ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో చెన్నై పైచేయి సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం అవ్వడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాస్త నిదానంగా ఆడినా సాహా (44: 46 బంతుల్లో, ఒక ఫోర్, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుఫ్లెసిస్ బాగా ఆడారు. చివర్లో వరుస వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ రాయుడు (17: 13 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ధోని (14: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. దీంతో చెన్నై ఓవర్లలో 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఈ విజయంతో చెన్నై తిరిగి మొదటి స్థానానికి చేరుకోవడంతో పాటు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టు చెన్నైయే.
మళ్లీ మామూలే..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రైజర్స్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జేసన్ రాయ్ (2: 7 బంతుల్లో) ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి రైజర్స్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే బ్రేవో బౌలింగ్‌లో విలియమ్సన్ (11: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుటయ్యాడు. ఆ తర్వాత కూడా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 63 పరుగులు మాత్రమే చేయగలిగారు.
ఆ తర్వాత వీరి కష్టాలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ప్రియం గర్గ్ (7: 10 బంతుల్లో), 13వ ఓవర్లో ఓపెనర్ సాహా (44: 46 బంతుల్లో, ఒక ఫోర్, 2 సిక్సర్లు) అవుటవ్వడంతో రైజర్స్ మరింత ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా రాణించకపోవడంతో 20 ఓవర్ల నష్టానికి రైజర్స్ ఏడు వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జోష్ హజిల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. బ్రేవో రెండు వికెట్లు, శార్దూల్, జడేజా చెరో వికెట్ తీశారు.
Also Read: కోహ్లీతో ముగ్గురు ఆటగాళ్ల ఢీ! రోహిత్ మద్దతు! సయోధ్య కోసమే ధోనీ మెంటార్‌షిప్?
మధ్యలో తడబడినా ఛేదన ఆగలేదు
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై చేజింగ్‌ను అద్భుతంగా ప్రారంభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (45: 37 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్.. రైజర్స్ బౌలర్లను పూర్తిగా డామినేట్ చేశారు. దీంతో 10 ఓవర్లలో వికెట్ కూడా నష్టపోకుండా చెన్నై సూపర్ కింగ్స్ 75 పరుగులు చేయగలిగింది. అయితే 11వ ఓవర్ మొదటి బంతికే రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు.
ఆ తర్వాత మొయిన్ అలీ (17: 17 బంతుల్లో, రెండు ఫోర్లు), రైనా (2: 3 బంతుల్లో), డుఫ్లెసిస్‌లు వెంటవెంటనే అవుట్ అవ్వడంతో చెన్నై కాస్త తడబడింది. ఈ దశలో విపరీతమైన హైడ్రామా నెలకొంది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చినప్పటికీ.. రాయుడు (17: 13 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ధోని (14: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి మ్యాచ్‌ను గెలిపించారు. ధోని చాలా రోజుల తర్వాత తన మార్కు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం. సన్ రైజర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
Also Read: సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ ఆఖరి మ్యాచ్ ఆడేశాడా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కామెంట్‌కు అర్థం ఏంటి?
Also Read: ఎవరు మంచోడు? ఎవరు చెడ్డోడు? క్రీడాస్ఫూర్తిపై విమర్శించిన వారికి అశ్విన్ ఘాటు సందేశం!