India Vs Pakistan: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్తాన్.. ఈసారి ఎక్కడంటే?
అంతర్జాతీయ క్రీడా వేదికపై మరో ఇండియా, పాకిస్తాన్ పోరుకు రంగం సిద్ధం అయింది. వచ్చే సంవత్సరం మార్చిలో రెండు జట్లూ అంతర్జాతీయ స్నేహపూర్వక కబడ్డీ మ్యాచ్ ఆడనున్నాయి.
ఇండియా, పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తలపడనున్నాయి. అయితే ఈసారి క్రికెట్‌లో కాదు... కబడ్డీలో. 2022 మార్చిలో ఈ రెండు జట్ల మధ్య అంతర్జాతీయ స్నేహపూర్వక కబడ్డీ మ్యాచ్ జరగనుంది. లాహోర్‌లో జరగనున్న నాలుగు దేశాల టోర్నీకి కొద్ది వారాల ముందు ఈ మ్యాచ్ జరగనుంది.
పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ సెక్రటరీ రాణా మహ్మద్ సర్వార్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘కర్తార్‌పూర్ కారిడార్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి ఇండియా, పాకిస్తాన్ అంగీకరించారు. ఈ మ్యాచ్ ద్వారా చరిత్ర సృష్టించనున్నాం. ఈ మ్యాచ్ ముగిశాక రెండు జట్లూ వారి దేశాలకు వెళ్లిపోతారు’ అని తెలిపారు.
‘ఈ అంతర్జాతీయ మ్యాచ్ వచ్చే సంవత్సరం మార్చి నెల చివరిలో జరుగుతుందని ఆశిస్తున్నాం. ఏప్రిల్‌లో లాహోర్‌లో నాలుగు దేశాల ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నిర్వహించనున్నాం. దానికి కొన్ని వారాల ముందు ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్, ఇండియా మాత్రమే కాకుండా.. కెనడా, ఇరాన్ కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఈ నాలుగూ అత్యుత్తమ జట్లు. దీంతో నాణ్యమైన కబడ్డీని అభిమానులు చూస్తారు. టోర్నీలో పాల్గొననున్న జట్లన్నీ దీని కోసం ఎదురు చూస్తున్నారు’ అన్నారు.
కరోనావైరస్ కారణంగా బాగా దెబ్బ తిన్న క్రీడ కబడ్డనే అని పేర్కొన్నారు. ‘ఈ క్రీడలో ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కబడ్డీకి పరిస్థితులు కష్టంగా మారాయి. క్యాంపులు కానీ, స్థానిక, అంతర్జాతీయ ఈవెంట్లు కానీ నిర్వహించడం చాలా కష్టం అయింది. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. ఇండియాతో జరగనున్న మ్యాచ్, నాలుగు దేశాల టోర్నమెంట్‌తో అంతర్జాతీయ కబడ్డీ పూర్తి స్థాయిలో ట్రాక్‌లోకి రానుంది.’ అని సర్వార్ తెలిపారు.
Also Read: T20 WC Standings: ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!
Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!
Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం