IND W vs AUS W: చివరి బంతి వరకు పోరాడి ఓడిన భారత్ - టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆస్ట్రేలియా!
భారత్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND vs AUS Womens T20 World Cup Semi Final: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంలో భారత్ విఫలం అయింది. చివరి బంతి వరకు పోరాడినప్పటికీ విజయానికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 167 పరుగులకే పరిమితం అయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఘోరమైన ప్రారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (2: 5 బంతుల్లో), షెఫాలీ వర్మ (9: 6 బంతుల్లో, ఒక ఫోర్), వన్ డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా (4: 7 బంతుల్లో, ఒక ఫోర్) ముగ్గురూ రెండంకెల స్కోరు చేయడంలో విఫలం అయ్యారు. దీంతో భారత్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. విజయంపై ఆశలు కూడా పూర్తిగా చెదిరిపోయాయి.
కానీ ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (43: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (52: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) మళ్లీ విజయంపై ఆశలు చిగురింపజేశారు. ఎదురుదాడికి దిగి భారీ షాట్లు ఆడారు. కానీ వీరిద్దరూ అనుకోని విధంగా అవుట్ కావడం టీమిండియా కొంప ముంచింది. నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం డార్సీ బ్రౌన్ వేసిన బౌన్సర్ తలపై నుంచి చాలా ఎత్తుగా వెళ్తున్నప్పటికీ అప్పర్ కట్‌కు ప్రయత్నించిన జెమీమా వికెట్ కీపర్ హీలీకి క్యాచ్ ఇచ్చి అనుకోని రీతిలో వెనుదిరిగింది.
ఇక హర్మన్ ప్రీత్ వికెట్ అయితే పూర్తిగా దురదృష్టకరం. రెండో పరుగు తీస్తూ దాదాపు క్రీజులోకి చేరుకున్నాక బ్యాట్ గ్రౌండ్‌లో స్టక్ అయిపోవడంతో క్రీజులోకి చేరుకోలేక రనౌట్ అయింది. దీనిపై తన ఫ్రస్ట్రేషన్ మ్యాచ్ పూర్తయ్యాక కూడా కనిపించింది. నిజానికి భారత్ మ్యాచ్ ఓడిపోయింది ఇక్కడే. అనంతరం రిచా ఘోష్ (14: 17 బంతుల్లో, ఒక ఫోర్) కూడా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి లాంగాన్ దగ్గర్లో టహ్లియా మెక్‌గ్రాత్ చేతికి చిక్కింది.
ఆ తర్వాత దీప్తి శర్మ (20: 17 బంతుల్లో, రెండు ఫోర్లు), స్నేహ్ రాణా (11: 10 బంతుల్లో, ఒక ఫోర్) వేగంగా ఆడటానికి ప్రయత్నించారు. మూడు ఓవర్లలో 31 పరుగులు కావాల్సి ఉండగా, 18వ ఓవర్లో 11 పరుగులు సాధించారు. అయితే కీలకమైన 19వ ఓవర్లో కేవలం నాలుగు పరుగులే రావడంతో పాటు స్నేహ్ రాణా కూడా అవుట్ అయింది. ఆఖరి ఓవర్లో దీప్తి శర్మ పోరాడటానికి ప్రయత్నించినా అది పరుగుల తేడాను తగ్గించడానికే సరిపోయింది. భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా డార్సీ బ్రౌన్, యాష్లే గార్డ్‌నర్ రెండేసి వికెట్లు తీశారు. జెస్ జొనాసెన్, మేగాన్ షట్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అదరగొట్టిన ఆసీస్ అమ్మాయిలు
అంతకు ముందు ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అలీస్సా హీలీ (25: 26 బంతుల్లో, మూడు ఫోర్లు), బెత్ మూనీ (54: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) కంగారూలకు శుభారంభం ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఈ దశలో ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని రాధా యాదవ్ విడదీసింది. అలీస్సా హీలీని అవుట్ చేసి భారత్‌కు మొదటి బ్రేక్ అందించింది.
క్రీజులో నిలదొక్కుకున్న బెత్ మూనీకి కెప్టెన్ మెగ్ లానింగ్ (49 నాటౌట్: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) తోడయింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. మెగ్ లానింగ్ ఖాతా తెరవక ముందే ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ రిచా ఘోష్ వదిలేసింది. ఆ తర్వాత స్టంపింగ్ అవకాశం కూడా చేజార్చుకున్నారు. దీనికి తోడు చాలా మిస్ ఫీల్డ్స్ కూడా అయ్యాయి. సులభంగా 15 నుంచి 20 పరుగులు మిస్ ఫీల్డ్‌ల రూపంలో కోల్పోయింది. అదే ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించింది.
అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం బెత్ మూనీ అవుట్ అయింది. ఆ తర్వాత యాష్లే గార్డ్‌నర్‌తో (31: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు) కలిసి మెగ్ లానింగ్ గేర్లు మార్చింది. చివరి ఆరు ఓవర్లలో ఆస్ట్రేలియా ఏకంగా 73 పరుగులు సాధించింది. ఇక్కడ కంట్రోల్ చేసినా 150 పరుగుల లోపే ఆస్ట్రేలియాను కట్టడి చేసి ఉండవచ్చు. కానీ బౌలర్ల వైఫల్యం కారణంగా ఆస్ట్రేలియాకు భారీ స్కోరు దక్కింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 172 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు దక్కించుకుంది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.