IND vs SA 1st ODI: వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం! ప్చ్..! ధోనీ శిష్యుడికి తప్పని ఎదురుచూపులు!!
ఐపీఎల్ లో రాణించిన వెంకటేశ్ అయ్యర్‌కు టీమ్‌ఇండియా ఎక్కువ అవకాశాలే ఇవ్వనుంది. అందుకే వన్డేల్లో అరంగేట్రం చేయిస్తోంది. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దొరకడం కష్టమే.
IND vs SA India Playing XI 1st ODI: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీసుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. టెస్టు సిరీసు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకే పార్ల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.
ఏడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఒక సాధారణ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానంలో వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చాడు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో రాణించిన వెంకటేశ్ అయ్యర్‌కు టీమ్‌ఇండియా ఎక్కువ అవకాశాలే ఇవ్వనుంది. అందుకే వన్డేల్లో అరంగేట్రం చేయిస్తోంది. తొలి వన్డేలో అతడు ఆడటం ఖాయమే! ఆరో బౌలింగ్ వనరుగా అతడిని ఉపయోగించుకోవాలని జట్టు యాజమాన్యం అనుకుంటోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత జట్టును ప్రతిసారీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరత వేధిస్తూనే ఉంది. ఇన్నాళ్లూ హార్దిక్ పాండ్య ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. వెన్నెముక శస్త్ర చికిత్స తర్వాత అతడు బంతి పట్టుకోవడం లేదు. దీంతో భారత్ మరొకరిని అన్వేషించే పనిలో పడింది.
'అవును, వెంకటేశ్ అయ్యర్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అతడు అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీసులో టీమ్‌ఇండియాకు ఆడాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జట్టుకు ఎప్పటికే ఆస్తే! మేం ప్రతిసారీ ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోసం చూస్తూనే ఉన్నాం. వారు జట్టుకు మరింత సమతూకం తీసుకురాగలరు. దక్షిణాఫ్రికాలో రాణించేందుకు అతడికి మంచి అవకాశం' అని కేఎల్ రాహుల్ అన్నాడు.
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దొరకడం కష్టమే. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడతాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. అతడికి తోడుగా శిఖర్ ధావన్ వస్తున్నాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. అందుకే రుతురాజ్ మరికొంత సమయం వేచిచూడక తప్పదు.
'వన్డేల్లో శిఖర్ ధావన్ బ్యాటింగ్, అతడు బౌలర్లను చితకబాదే విధానాన్ని నేను వ్యక్తిగతంతో ఎంతో ఎంజాయ్ చేస్తాను. ప్రతిసారీ చేసేదే ఇప్పుడూ చేయాలని కోరుకుంటున్నాను' అని రాహుల్ చెప్పాడు.
భారత్ జట్టు (అంచనా): కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్/భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
Also Read: Team India Next Captain: విరాట్ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్..! లాజిక్ ఇదే!
Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్!
Also Read: Lucknow IPL Franchise: కేఎల్ రాహుల్ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!