![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్ సై..! లేదంటే ఓటమి బాటే!!
టెస్టు సిరీసు పరాజయానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు భారత్‌కు మరొక్క అవకాశమే మిగిలుంది. పార్ల్ వేదికగా శుక్రవారం సఫారీలతో రెండో వన్డేలో తలపడనుంది. గెలుపు బావుటా ఎగరేయాలంటే జట్టులో మార్పులు చేయక తప్పదు.
![IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్ సై..! లేదంటే ఓటమి బాటే!! IND vs SA 2nd ODI Team India Playing XI prediction Suryakumar Yadav For Shreyas Iyer, Md Siraj For Bhuvneshwar Kumar Two Changes Expected IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్ సై..! లేదంటే ఓటమి బాటే!!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/b44b76cde78899affd173009196cccc9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సఫారీ గడ్డపై టీమ్‌ఇండియాకు పదేపదే గర్వభంగం జరుగుతూనే ఉంది! అక్కడ సిరీసు విజయం అందని ద్రాక్షే అవుతోంది. నోటిదాకా వచ్చిన ఆహారం నేల పాలైనట్టుగా అన్ని మ్యాచుల్లో విజయం దూరమవుతూనే ఉంది. టెస్టు సిరీసు పరాజయానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు భారత్‌కు మరొక్క అవకాశమే మిగిలుంది. పార్ల్ వేదికగా శుక్రవారం ఆతిథ్య జట్టుతో రెండో వన్డేలో తలపడనుంది. గెలుపు బావుటా ఎగరేయాలంటే జట్టులో మార్పులు చేయక తప్పదు.
ధావన్, కోహ్లీ సూపర్
టీమ్‌ఇండియాను చూస్తుంటే పేపర్‌పైన బలంగా మైదానంలో బలహీనంగా కనిపిస్తోంది! జట్టులో అంతా అరివీర భయంకరులే. కానీ విజయానికి అడుగు దూరంలోనే నిలిచిపోతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక సమయాల్లో విఫలమవుతున్నారు. ఓపెనర్లు రాణిస్తే మిడిలార్డరు కుదేలవుతోంది. లేదంటే రివర్స్ జరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ తన బ్యాటింగ్ విలువేంటో చాటిచెప్పాడు. తొలి వన్డేలో అతడుగానీ సెంచరీ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. విరాట్ కోహ్లీ అర్ధశతకం చేసి ఫామ్ కొనసాగించడం సానుకూలం. రెండేళ్లుగా ఊరిస్తున్న సెంచరీ చేసేస్తే ఓ పనైపోతుంది.
మిడిలార్డర్ ఘోరం
మిడిలార్డర్ పరంగా మార్పులు అవసరం. శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ వచ్చే అవకాశం ఉంది. లేదా శ్రేయస్, సూర్య ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వొచ్చు. రిషభ్ పంత్ మరింత పరిణతి ప్రదర్శించాలి. శార్దూల్ అర్ధశతకం చేయడం అతడి ఆత్మవిశ్వాసం పెంచేదే. అరంగేట్రంలో వెంకటేశ్ అయ్యర్ ఆకట్టుకోలేదు. సీనియర్లే విఫలమైనప్పుడు అతడిని అనడంలో అర్థం లేదు! ఏదేమైనా టీమ్‌ఇండియా బ్యాటర్లు చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పనంత వరకు విజయాలు దక్కవు.
బౌలింగ్‌కు ఏమైంది?
బౌలింగ్ విభాగం పరిస్థితీ అర్థం కావడం లేదు. సఫారీ బౌలర్లు భాగస్వామ్యాలను విడదీస్తున్నప్పుడు మనోళ్లు ఆ పని ఎందుకు చేయడం లేదో!! బుమ్రా ఒక్కడే తెలివిగా బౌలింగ్ చేస్తున్నాడు. సఫారీలు షార్ట్‌పిచ్ బంతులేసి బోల్తా కొట్టిస్తుంటే మనోళ్లు మాత్రం 6 మీటర్ల దూరంలో విసురుతున్నారు. ముందుగానే అంచనా వేసిన సఫారీలు సులభంగా ఆడేస్తున్నారు. రెండో వన్డేలో భువీకి చోటు కష్టమే. అతడి స్థానంలో సిరాజ్ వచ్చేస్తాడు. కేఎల్ రాహుల్ నాయకత్వంలో అనుభవలేమి కనపించింది. వెంకీ అయ్యర్‌కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. మధ్య ఓవర్లలో సీనియర్లతోనే బౌలింగ్ చేయించాడు.
సఫారీలు సై
మరోవైపు దక్షిణాఫ్రికా విజయం అందించిన విశ్వాసంతో ఉంది. ఆ జట్టు బ్యాటర్లు నమ్మకంతో బ్యాటింగ్ చేస్తున్నారు. తెంబా బవుమా, వాండర్ డుసెన్ టెస్టు ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఆ జట్టులో ఎవరో ఒకరు క్రీజులో నిలవాలన్న కసితో ఆడుతున్నారు. ఆన్రిచ్ నార్జ్ లేకపోయినా సఫారీ బౌలింగ్ దళం బలంగా కనిపిస్తోంది. యువ పేసర్ జన్‌సెన్ వైవిధ్యం తీసుకొచ్చాడు. బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నాడు. ఎంగిడి, ఫెలుక్‌వాయో, రబాడా సమయోచితంగా బంతులు విసురుతున్నాడు. ముఖ్యంగా టీమ్‌ఇండియా బ్యాటర్ల బలహీనతలపై వీరు చక్కగా వర్క్ చేశారు. అందుకు తగ్గట్టే ఫీల్డర్లను మోహరించి బంతులేసి ఫలితం రాబడుతున్నారు.
Also Read: SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)