Glenn Maxwell: మెల్‌బోర్న్‌లో మాక్స్‌వెల్ అరాచకం.. బౌండరీలతోనే ఏకంగా 112 పరుగులు.. ఆర్సీబీ రికార్డు మూడో స్థానానికి.. అయినా హ్యాపీనే!
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ రికార్డు నమోదు చేసింది. 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 273 పరుగులు చేసింది.
బిగ్‌బాష్‌లో లీగ్‌లో కొత్త రికార్డు నమోదైంది. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ఆర్సీబీ రిటైన్ చేసుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ 64 బంతుల్లోనే 154 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఏకంగా 22 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మ్యాక్సీతో పాటు మార్కస్ స్టోయినిస్ (75 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు) కూడా రాణించారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం హోబర్ట్ హరికేన్స్ చేసిన పాపం అయింది. సాధారణంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మెల్‌బోర్న్ ఊచకోత మొదలైంది. కేవలం 3.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును మెల్‌బోర్న్ చేరుకుంది.
పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 79 పరుగులను మెల్‌బోర్న్ సాధించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు మరో ఓపెనర్ జో క్లార్క్ (35: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా చెలరేగి ఆడాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 99 పరుగులు జోడించారు. ఏడో ఓవర్ ఆఖరి బంతికి జో క్లార్క్ అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన నిక్ లార్కిన్‌తో కలిసి రెండో వికెట్‌కు మ్యాక్స్‌వెల్ 44 పరుగులు జోడించాడు. అందులో నిక్ వాటా కేవలం మూడు పరుగులు మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాక్స్‌వెల్ ఎంత డామినేట్ చేశాడో. కేవలం 41 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ శతకం పూర్తయింది. ఇక 11వ ఓవర్లో నిక్ అవుటయ్యాక మ్యాక్స్‌వెల్‌కు స్టోయినిస్ జత కలిశాడు. వీరిద్దరూ అజేయమైన మూడో వికెట్‌కు తొమ్మిది ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి మెల్‌బోర్న్ స్టార్స్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. బిగ్ బాష్ లీగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం.
టీ20 లీగ్‌ల్లో ఇది అత్యధిక స్కోరు. 2019లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (267/2) స్కోరు రెండో స్థానానికి పడిపోయింది. ఇక మూడో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (263/5) ఉంది. క్రిస్ గేల్ 175 పరుగులు చేసింది. టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ మ్యాచ్‌లో గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు. టీ20ల్లో ఇప్పటివరకు వేగవంతమైన శతకం కూడా ఇదే. తమ రికార్డును వెనక్కి నెట్టినప్పటికీ ఆర్సీబీ హ్యాపీనే. ఎందుకంటే మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రూ.11 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఓపెనర్‌గా కూడా రాణించాడు కాబట్టి ఐపీఎల్‌లో కూడా మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ ఓపెనర్‌గా ఉపయోగించే అవకాశం ఉంది.
Also Read: Team India Next Captain: విరాట్ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్..! లాజిక్ ఇదే!
Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్!
Also Read: Lucknow IPL Franchise: కేఎల్ రాహుల్ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!