IND vs AUS: టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ దిశగా భారత్ - మరో రెండు విజయాల దూరంలోనే!
టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ దిశగా టీమిండియా సాగుతోంది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.
IND vs AUS WTC Points Table: ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఈ పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా జట్టు 70.83 మార్కులతో మొదటి స్థానంలో ఉండగా, ప్రస్తుతం భారత జట్టు 61.66 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో ఓవల్ వేదికగా జరగనున్న ఈ ఎడిషన్‌లోని డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు తన స్థానాన్ని ఖాయం చేసుకునే దిశగా అడుగులు వేసింది.
ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే, భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను కనీసం 3-1 తేడాతో గెలవాలి. అప్పుడు భారత జట్టు స్కోరు శాతం 61.92కి చేరుకోగలదు. ఒకవేళ అలా జరగకపోతే మార్చి నెలలో న్యూజిలాండ్, శ్రీలంకల రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.
మరోవైపు భారత జట్టు ఇప్పుడు ఈ సిరీస్‌ను 3-0 లేదా 4-0 తేడాతో గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలవనుంది. ఆస్ట్రేలియా జట్టు తదుపరి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ అయినా గెలవాలి. లేకపోతే కివీ జట్టుతో జరిగే టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంటే శ్రీలంక జట్టుకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ ఆడే అవకాశం కచ్చితంగా ఉంటుంది.
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలర్ల హవా స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐదు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ మార్చి 17వ తేదీ నుంచి ఢిల్లీలో జరగనుంది.
తొలి టెస్టులో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంలో మరోసారి తమ బలహీనతను బయటపెట్టుకున్న కంగారూలు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించిన వేళ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
స్పిన్నర్లు తిప్పేసిన వేళ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
పేసర్లు ఆరంభించారు. బ్యాటర్లు రాణించారు. స్పిన్నర్లు చుట్టేశారు. ఇదీ తొలి టెస్టులో భారత్ ఆట సాగిన తీరు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 177 పరుగులకే ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, షమీలు తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్లలో లబూషేన్ (49), స్మిత్ (37), హ్యాండ్స్ కాంబ్ (31), అలెక్స్ క్యారీ (36) పరుగులతో రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ (84), అశ్విన్ (70), షమీ (37) పరుగులతో ఆకట్టుకున్నారు.