Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్ - కుంబ్లేను కూడా వెనక్కినెట్టి!
భారత విజయాల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.
India vs Australia Border Gavaskar Trophy: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టు ఒకటి కాదు ఎన్నో విజయాలు సాధించింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. భారత క్రికెట్ చేసిన ఈ విజయవంతమైన ప్రయాణంలో ఎందరో గొప్ప క్రికెటర్లు సహకరించారు.
భారత క్రికెట్ విజయ రహస్యం
ఇప్పటి వరకు భారత్ గెలిచిన అన్ని మ్యాచ్‌లలో ఎవరు ఎక్కువ పరుగులు చేశారు, ఎవరు ఎక్కువ వికెట్లు తీశారు? ఇలాంటి ప్రశ్నలు క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వారికి వస్తూనే ఉంటాయి. భారత విజయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు భారత క్రికెట్‌లో అత్యుత్తమ హీరోలు.
భారత్ విజయంలో అత్యధిక పరుగులు చేసినవారు ఎవరు?
బ్యాటింగ్ చేయడం గురించి చెప్పాలంటే, ఈ జాబితాలో అగ్రస్థానంలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు ఉంది. సచిన్ తన కెరీర్‌లో ఎన్నో వేల పరుగులు సాధించాడు, అయితే వాటిలో సచిన్ చేసిన 17,113 పరుగులు భారత్ విజయంలో ఉన్నాయి.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకు చేసిన 16,352 పరుగులు భారత విజయంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే విరాట్ మొదటి స్థానానికి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
భారత్ విజయంలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి ఎవరు?
ఇప్పుడు బౌలర్ల గురించి మాట్లాడుకుందాం. రవిచంద్రన్ అశ్విన్ భారత విజయంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత మాజీ బౌలర్ అనిల్ కుంబ్లేను వెనక్కి నెట్టాడు. అశ్విన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 489 వికెట్లు పడగొట్టాడు. ఈరోజు, నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తన పేరిట ఈ రికార్డును రాసుకున్నాడు. ఈ జాబితాలో అతని తర్వాత గ్రేట్ క్రికెటర్ అనిల్ కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. అతను తన కెరీర్‌లో కొన్ని వందల వికెట్లు తీశాడు. అయితే వాటిలో 486 వికెట్లు భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లో వచ్చాయి.
మ్యాచ్ మూడో రోజు 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ఈ సిరీస్ ముందు వరకు సూపర్ ఫాంలో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను స్లిప్ లో కోహ్లీ క్యాచ్ తో ఔట్ చేసిన అశ్విన్.. వికెట్ల పతనానికి తెరలేపాడు. ఆ తర్వాత ఏ దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేదు. అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ జారవిడవటంతో బతికిపోయిన వార్నర్ అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు.
41 బంతుల్లో 10 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత లబూషేన్ (28 బంతుల్లో 17)ను జడేజా వెనక్కు పంపాడు. ఆ తర్వాతంతా అశ్విన్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా వికెట్లు పడగొట్టాడు. యాష్ ధాటికి రెన్ షా (7 బంతుల్లో 2), హ్యాండ్స్ కాంబ్ (6 బంతుల్లో 6), అలెక్స్ క్యారీ (6 బంతుల్లో 10) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ 3 వికెట్లు ఎల్బీ రూపంలోనే రావడం గమనార్హం. ఆ తర్వాత మిగతా పనిని జడేజా, అక్షర్, షమీలు లు పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.