IND vs AFG, Match Highlights: ఎట్టకేలకు ఒక్క విజయం.. ఆఫ్ఘనిస్తాన్‌పై 66 పరుగులతో భారత్ విక్టరీ
ICC T20 WC 2021, IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ 66 పరుగులతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితం అయింది. దీంతో భారత్ తన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే న్యూజిలాండ్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడిపోతేనే మనకు సెమీస్ అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చితక్కొట్టిన ఓపెనర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఎట్టకేలకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (69: 48 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), రోహిత్ శర్మ (74: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు) ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను చితకబాదారు. రషీద్ ఖాన్, నబీ వంటి బౌలర్లకు కూడా వికెట్ దక్కలేదు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరు పూర్తి సాధికారికంగా ఆడారు. దీంతో 10 ఓవర్లలో స్కోరు 85 పరుగులకు చేరింది.
ఆ తర్వాత వీరిద్దరూ గేర్లు మార్చారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రోహిత్, 13వ ఓవర్లో రాహుల్ అర్థ సెంచరీలు సాధించారు. మొదటి వికెట్‌కు 140 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రోహిత్ శర్మ అవుటయ్యాడు. మరో ఏడు పరుగులకే కేఎల్ రాహుల్ కూడా అవుట్ కావడంతో 180 పరుగులకే పరిమితం అవుతారేమో అనిపించింది. అయితే రిషబ్ పంత్ (27 నాటౌట్: 13 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (35 నాటౌట్: 13 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరిద్దరూ అజేయమైన మూడో వికెట్‌కు 22 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బాదిన్, కరీం చెరో వికెట్ తీశారు.
కట్టడి చేసిన బౌలర్లు
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు షెహజాద్ (0: 4 బంతుల్లో), జజాయ్ (13: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వరుస ఓవర్లలో అవుట్ అవ్వడంతో ఆఫ్ఘన్ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గుర్బాజ్ (19: 10 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కాసేపు వేగంగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి స్కోరుబోర్డు మీదకి 47 పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. ఏడో ఓవర్లో గుర్బాజ్, పదో ఓవర్లో నయీబ్ (18: 20 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుటయ్యారు. దీంతో 10 ఓవర్లలో ఆఫ్ఘన్ నాలుగు వికెట్లు కోల్పోయి.. 61 పరుగులు చేసింది.
ఆ తర్వాత 12వ ఓవర్లో జద్రాన్ (11: 13 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా అవుటయ్యాడు. అయితే కెప్టెన్ నబీ (35: 32 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), కరీం జనత్ (42 నాటౌట్: 22 బంతుల్లో, మూడు ఫోర్, రెండు సిక్సర్లు) బాగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నబీ కూడా అవుటయ్యాడు. వెంటనే రషీద్ ఖాన్(0) కూడా అవుటయ్యాడు. దీంతో 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితం అయింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. జడేజా, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ