Tokyo Olympics: పతకం గెలిస్తే డబ్బే డబ్బు... ఏ రాష్ట్రం ఎంత ఆఫర్ చేస్తుందంటే?
క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి.
సాధారణంగా మన క్రీడాకారులు ప్రతిష్టాత్మక టోర్నీల్లో విజయం సాధిస్తే వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక నజరానా ప్రకటిస్తుంటాయి. ఇప్పటి వరకు క్రీడాకారులు టోర్నీలు గెలిచి వచ్చిన తర్వాత వారిని సన్మానించి నజరానాలు ప్రకటించడం చూశాం. కొన్ని రాష్ట్రాలైతే నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్ని కూడా కల్పిస్తాయి.
కానీ, ఈ సారి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేశాయి. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి. అంతేకాదు, మరికొన్ని రాష్ట్రాలైతే తమ రాష్ట్రం తరఫున ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన వారికి కూడా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు ఏ పతకం గెలిస్తే ఎంత ఇస్తాయో ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం:
స్వర్ణం గెలిచిన వారికి రూ.75లక్షలు, రజతం గెలిచిన వారికి రూ.50 లక్షలు, కాంస్యం గెలిచిన వారికి రూ.35లక్షలు ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది.
రాజస్థాన్:
రాజస్థాన్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన ఏ క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు, రజతం గెలిస్తే రూ.2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
హరియాణా:
రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైనా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ. 4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 1.5కోట్లు ఇస్తామని
ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ తెలిపారు.
పంజాబ్:
పంజాబ్ ముఖ్యమంత్రి రాణా గుర్మీత్ సింగ్ ఆ రాష్ట్ర క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయిన క్రీడాకారులు ఒకొక్కరికీ రూ.5లక్షలు ఇస్తామన్నారు. దీంతో పాటు స్వర్ణం గెలిస్తే రూ.2.25కోట్లు, రజతం గెలిస్తే రూ.1.5కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు అందించనుంది.
కర్ణాటక:
తమ రాష్ట్ర క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ. 5కోట్లు, రజతం గెలిస్తే రూ. 3కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2కోట్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్:
పంజాబ్ ప్రభుత్వం లాగానే ఉత్తరప్రదేశ్ కూడా ఆ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైతే ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన ఒకొక్కరికీ రూ.10లక్షలు ఇవ్వనుంది. అలాగే స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ.4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2 కోట్లు అందించనున్నట్లు తెలిపింది.
తమిళనాడు:
ఒలింపిక్స్‌లో నగదు ప్రోత్సాహకంతో పాటు ప్లాట్ కూడా ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 3కోట్లు, రజతం గెలిస్తే రూ. 2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనుంది.
ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ కూడా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరి, పతకాలు గెలిచి ఏ క్రీడాకారులు ఎంతెంత తమ ఖాతాల్లో వేసుకుంటారో చూద్దాం.