Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Number 10 Jersey: ఆటగాళ్లు.. వారు ధరించే జెర్సీలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. అదేంటో దిగ్గజాలంతా జెర్సీ నంబర్ 10 అంటే ఇష్టపడతారు! పీలె నుంచి సచిన్ వరకు జెర్సీ 10 ధరించిన ఐదుగురు లెజెండ్స్ వీరే!
Number 10 Jersey:
ఆటగాళ్లు.. వారు ధరించే జెర్సీలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. తమకు నచ్చిన సంఖ్యతో జెర్సీ ధరించి ఆడితే సౌకర్యంగా ఫీలవుతారు. అద్భుతాలు చేస్తుంటారు. ఫుట్‌బాల్, క్రికెట్లో ఈ సెంటిమెంటు మరీ ఎక్కువగా ఉంది. అదేంటో దిగ్గజాలంతా జెర్సీ నంబర్ 10 అంటే ఇష్టపడతారు! పీలె నుంచి సచిన్ వరకు జెర్సీ 10 ధరించిన ఐదుగురు లెజెండ్స్ వీరే!
పీలె ది గ్రేట్!
ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు పీలె! 17 ఏళ్లకే జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన ఆయన అదే ఏడాది ప్రపంచకప్ అందుకున్నాడు. 1958, 1962, 1970లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా మారాడు. ప్రపంచకప్పుల్లో 12 గోల్స్ కొట్టడమే కాకుండా 10 గోల్స్‌కు అసిస్ట్ చేశాడు. కెరీర్లో 1200కు పైగా గోల్స్ కొట్టిన ఆయన 1970 ప్రపంచకప్‌లో ఇటలీపై 4-1తో గెలిచిన మ్యాచులో గోల్స్‌తో దిగ్గజంగా మారారు. గురువారం రాత్రి ఆయన మరణించారు.
మెస్సీకీ ఇష్టమే!
ఫుట్‌బాల్ మైదానంలో పదో పొజిషన్లో ఎప్పుడూ ఆడలేదు గానీ ఆ నంబర్ జెర్సీతో అదరగొట్టాడు లయోనల్ మెస్సీ. ప్రొఫెషనల్ లీగులు, ద్వైపాక్షిక, ప్రాంతీయ మ్యాచుల్లో వరుస పెట్టి గోల్స్ చేసి గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. ఎంత చేసినా ప్రపంచకప్ సాధించకపోవడంతో అతడు దిగ్గజం కాదని చాలామంది విమర్శించారు. అన్నింటినీ అధిగమించి ఖతార్లో అర్జెంటీనాను విజేతగా నిలిపి ప్రపంచకప్ ముద్దాడాడు మెస్సీ! తన సమకాలీకుల్లో ఎవరికీ లేని రికార్డులు సృష్టించాడు.
డిగో అడుగెడితే!
మైదానంలో డిగో మారడోనా పరుగెడుతూ బంతిని డ్రిబ్లింగ్ చేస్తుంటే అభిమానులు పులకించిపోయేవారు. ప్రత్యర్థులేమో ఇబ్బంది పడేవారు. తన దేశమైన అర్జెంటీనా, తన క్లబ్స్ నెపోలి, బోకా జూనియర్స్‌కు తిరుగులేని కీర్తిప్రతిష్ఠలు సాధించిపెట్టాడు డిగో. పదో నంబర్ వేసుకున్న వన్ మ్యాన్ ఆర్మీగా అతడిని పిలిచేవారు. 1986లో ఇంగ్లాండ్‌పై ఆయన చేసిన గోల్‌ను ఈ శతాబ్దంలోనే అత్యుత్తమమైందిగా చెప్తారు. ఆయన గౌరవార్థం నెపోలి జెర్సీ 10కి వీడ్కోలు ప్రకటించింది.
రొనాల్డినోకు అనుబంధం!
బ్రెజిల్ సూపర్ స్టార్ రొనాల్డినో ఎన్నో జెర్సీలు ధరించాడు. పదో నెంబర్ జెర్సీ ధరించాకే అతడు తిరుగులేని ఆటగాడిగా మారాడు. బార్సిలోనా క్లబ్‌కు పదో నంబర్ జెర్సీతోనే ఆడాడు. తన తరంలోనే కాకుండా తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిచాడు. ఎలాస్టికో, నో లుక్ పాసెస్‌తో అలరించాడు. 2004, 2005లో ఫిఫా అత్యుత్తమ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2022లో ప్రపంచకప్ ముద్దాడాడు. ప్రతి సీజన్లో అతడు 30 గోల్స్ చేయలేదు కానీ బంతిని అభిమానులను మురిపించాడు.
సచిన్ -10 వేర్వేరు కాదు!
టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు పదో నెంబర్ జెర్సీకి విడదీయరాని అనుబంధం. అరంగేట్రం నుంచి ఆయన పరుగుల వరద పారించాడు. అత్యంత కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలో 664 మ్యాచులాడి 34,357 పరుగులు చేశాడు. 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు బాదేశాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్‌పై పరుగుల సునామీ సృష్టించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌ను త్రుటిలో మిస్సైన్ మాస్టర్ బ్లాస్టర్ 2011లో స్వదేశంలో అందుకొని మురిసిపోయాడు.