FIFA World Cup 2022 Prize Money: ఫిఫా ప్రపంచకప్ విజేత ప్రైజ్ మనీ అన్ని కోట్లా!
FIFA World Cup 2022 Prize Money: ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ మొదలైపోయింది. మరి ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా!
FIFA World Cup 2022 Prize Money: మరికొన్ని గంటల్లో ఫిఫా వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీనవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగుతుంది. ఈరోజు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆతిథ్య ఖతార్- ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచుతో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మరి ఈ టోర్నీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!
ప్రైజ్ మనీ
ప్రపంచకప్ లో విజేతగా నిలిచే జట్టుకు అక్షరాలా రూ. 344 కోట్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. రన్నరప్ కు రూ. 245 కోట్లు దక్కుతాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 220 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న టీంకు రూ. 204 కోట్లు ఇస్తారు.
అత్యధిక గోల్స్ చేసిన జట్టు, ఆటగాడు
ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్పుల్లో ఆడిన ఏకైక దేశంగా బ్రెజిల్ కొనసాగుతోంది. ఎక్కువ గోల్స్ ఆ దేశమే చేసింది. మొత్తం 229 గోల్స్ కొట్టింది. వ్యక్తిగతంగా చూసుకుంటే జర్మనీ మాజీ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ 16 గోల్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు.
21 కప్పులు.. 8 దేశాలు
ఇప్పటివరకూ 21 ప్రపంచకప్‌లు జరగ్గా.. 8 దేశాలు విజేతగా నిలిచాయి.అత్యధికంగా 5 సార్లు బ్రెజిల్ కప్పు గెలుచుకుంది. ఇటలీ, జర్మనీ చెరో 4 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఉరుగ్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తలా 2 సార్లు టైటిల్ దక్కించుకున్నాయి. ఇంగ్లాండ్, స్పెయిన్ ఒక్కోసారి కప్పును ముద్దాడాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్ 1930లో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లో టోర్నీని నిర్వహించలేదు.
ప్రత్యేక ఆకర్షణగా ఎగిరే మస్కట్
ఫిఫా ప్రపంచకప్ అనగానే ముందుగా టోర్నీకి ఆకర్షణగా నిలిచే మస్కట్ గుర్తుకొస్తుంది. ఈ సారి కూడా టోర్నీ అధికారిక మస్కట్ ‘‘లాయిబ్’’ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ముస్లిం పురుషులు సంప్రదాయంగా తలపై ధరించే వస్త్రం (గత్రా)ను పోలి ఉండే దుస్తులు ధరించి గాల్లోకి ఎగురుతూ ఫుట్‌బాల్ ఆడేలా మస్కట్‌ను రూపొందించారు. ‘‘లాయిబ్’’ అంటే అరబిక్‌లో ‘‘అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడు’’ అని అర్థం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, తమను తాము నమ్మాలని ఈ మస్కట్ చాటుతోంది.
ఖతార్ ఆతిథ్యం... వివాదాల పర్వం
ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటోంది. గత కొన్ని దశాబ్దాల్లో ఏ ప్రపంచకప్‌కూ లేని వ్యతిరేకత, విమర్శలు ఈ టోర్నీ విషయంలో ఎదురవుతున్నాయి. వాతావరణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ జూన్-జులై నెలల్లో జరిగే టోర్నీని నవంబరు-డిసెంబరు నెలలకు వాయిదా వేయడంపై ముందు నుంచే వ్యతిరేకత ఉంది. అది చాలదన్నట్లు స్టేడియాల్లో బీర్ల అమ్మకాన్ని నిషేధించడం, వస్త్రధారణ విషయంలో ఆంక్షలు విధించడంపై ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫిఫా సైతం దీనిపై అసంతృప్తితో ఉంది. మరోవైపు ప్రపంచకప్ కోసం భారీగా ఖర్చు చేయడం, స్టేడియాల నిర్మాణంలో తగు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై స్థానికుల్లో నిరసన తప్పట్లేదు. మరి వీటన్నింటినీ దాటుకుని ఖతార్ ప్రపంచకప్ ను ఎంత బాగా నిర్వహిస్తుందో చూద్దాం.
Group A! 🇶🇦🇨🇴🇸🇳🇳🇱
— FIFA World Cup (@FIFAWorldCup) November 20, 2022
💪 Get hyped. Get Ready…
Your #FIFAWorldCup journey begins TODAY! 🔥 pic.twitter.com/lDB4LsHc0P