Anshu Malik Wins Silver: రెజ్లింగ్‌లో రజతం సాధించిన అన్షు మాలిక్ - అభినందించిన ప్రధాని మోదీ!
ప్రముఖ భారత రెజ్లర్ అన్షు మాలిక్ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో రజతం సాధించింది.
శుక్రవారం 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మాలిక్ రజతం సాధించారు. ఫైనల్ పోరులో నైజీరియాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ ఒడునాయో ఫోలాసాడే అడెకురోయేతో 7-3 తేడాతో అన్షు మాలిక్ ఓటమి పాలైంది.
భారత రెజ్లర్ అన్షు మాలిక్ క్వార్టర్-ఫైనల్‌లో 10-0తో ఆస్ట్రేలియాకు చెందిన ఐరీన్ సిమియోనిడిస్‌ను టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా ఓడించింది. సెమీఫైనల్‌లో కూడా 10-0తోనే శ్రీలంకకు చెందిన నేత్మీ పొరుతోటగేను రైడా టెక్నికల్ సుపీరియారిటీ ద్వారానే మట్టి కరిపించింది. అది కూడా కేవలం ఒక నిమిషంలోనే ఓడించడం విశేషం.
అంతకుముందు శుక్రవారం కోవెంట్రీలోని విక్టోరియా పార్క్ ఎరీనాలో జరగాల్సిన రెజ్లింగ్ పోటీలు కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేయబడ్డాయి. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ కొన్ని సెక్యూరిటీ డ్రిల్స్ చేసేందుకు రెజ్లింగ్ పోటీలను కొంతకాలం ఆపింది.
రెజ్లర్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్షు మాలిక్ 2021 ఓస్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అంతర్జాతీయ రెజ్లర్ ధరమ్‌వీర్ మాలిక్ కుమార్తె అయిన అన్షు గతంలో కూడా ఎన్నో పతకాలను సాధించింది.
57 కిలోల ఈవెంట్‌లో న్యూఢిల్లీలో జరిగిన 2020 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. అదే సంవత్సరం మహిళల 57 కిలోల విభాగంలో బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఇండివిజువల్ రెజ్లింగ్ ప్రపంచ కప్‌లో కూడా రజతం సాధించింది. అన్షు మాలిక్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందించడం విశేషం.
View this post on Instagram