CSK vs MI: పంతం నీకా నాకా హై..! చివరి 5లో 4 ముంబయివే.. రోహిత్, ధోనీలో నేడు గెలిచేదెవరు?
ప్రస్తుతం చెన్నైతో పోలిస్తే ముంబయి బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ధోనీకి బ్యాటింగ్ ప్రాక్టీస్ లేదు. ఏదేమైనా రోహిత్ వర్సెస్ ధోనీ శత్రుత్వం మజా అందించనుంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండో దశ మరికొన్ని గంటల్లో మొదలవుతోంది. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తొలిపోరులో ఢీకొంటున్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత ఐపీఎల్ మొదలవుతున్న నేపథ్యంలో ఏ జట్టు బలం ఏంటి? ఎవరిపై ఎవరిది పైచేయి? ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
ముంబయి మెరుగ్గా..
ప్రస్తుతం చెన్నైతో పోలిస్తే ముంబయి బలంగా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ లేదు. ఏదేమైనా రోహిత్ వర్సెస్ ధోనీ శత్రుత్వం (మ్యాచ్ వరకు) మజా అందించనుంది. ముంబయిలో డికాక్, సూర్య, కిషన్, పొలార్డ్, హార్దిక్‌కు ఈ మధ్య మ్యాచ్ అనుభవం బాగానే దొరికింది. బౌలింగ్ పరంగానూ బుమ్రా, బౌల్ట్ మెరుగ్గా కనిపిస్తున్నారు.
ఫిట్‌నెస్ లోపాలు..
చెన్నై పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆటగాళ్లలో ఫిట్‌నెస్ లోపాలు బయటపడ్డాయి. డుప్లెసిస్ ఇంకా కోలుకోలేదు. డ్వేన్ బ్రావో ఫిట్‌నెస్‌తో ఉన్నా ఏ స్థాయిలో ఆడతాడో చెప్పలేం. క్వారంటైన్ వల్ల యువ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ అందుబాటులో లేడు. రుతురాజ్ గైక్వాడ్‌తో ఓపెనింగ్‌కు ఎవరొస్తారో తెలియదు. మొయిన్ అలీని ముందుగా పంపించినా ఆశ్చర్యం లేదు. మిడిలార్డర్లో ఎవరు విఫలమైనా ధోనీపై ఒత్తిడి తప్పదు. ఇక బంతితో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ రాణించక తప్పదు.
ముంబయి వ్యూహం
చెన్నై బ్యాటింగ్ ఆర్డర్లో ఎడమ చేతివాటం బ్యాటర్లు ఎక్కువ. అందుకే మొయిన్ అలీ, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాను ఎదుర్కొనేందుకు ముంబయి జయంత్ యాదవ్‌ను ప్రయోగించొచ్చు. యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ సైతం ప్రభావం చూపిస్తాడు. తొలి దశలో రాహుల్ ఎడమచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేసి 14.50 సగటుతో 6.60 రన్‌రేట్‌తో పరుగులు ఇచ్చాడు. ది హండ్రెడ్ టోర్నీలో మెరుపులు మెరిపించిన ఆడమ్ మిల్నె సైతం ముంబయికి ఉన్నాడు.
Also Read: IPL 2021: 'హే.. మీ దగ్గర నీళ్లున్నాయా?' బుమ్రా దంపతులకు సూర్య ప్రశ్న!
రుతురాజ్‌కు అండ?
రుతురాజ్ పవర్‌ప్లేలో తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. మధ్య ఓవర్లలో రెచ్చిపోతున్నాడు. ఈ పరిస్థితిని గమనించి అతడికి అండగా నిలిచే ఓపెనర్‌ను చెన్నై పంపించాల్సి ఉంటుంది. ఇదే సమీకరణాన్ని ముంబయి తమకు అనుకూలంగానూ మలచుకోగలదు. కాగా గత సీజన్లో ముంబయి ఏకంగా 137 సిక్సర్లు బాదగా ఈసారి మాత్రం ఆ స్థాయిలో మెరుపుల్లేవ్. అదే చివరి సీజన్లో పేలవంగా ఆడిన ధోనీసేన ఈ సీజన్ ఏడు మ్యాచుల్లో ఏకంగా 62 సిక్సర్లు బాదేయడం విశేషం.
చివరి 5లో 4 గెలిచిన ముంబయి
ఐపీఎల్‌లో చెన్నైపై ముంబయిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా 19 సార్లు ముంబయి, 12 సార్లు చెన్నై గెలిచాయి. చివరి ఐదింట్లో రోహిత్‌సేన ఏకంగా నాలుగుసార్లు గెలిచింది. ఈ సీజన్ తొలిదశలో మే 1న ధోనీసేనతో తలపడ్డ పోరులో ముంబయి 219 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతోఛేదించింది. డికాక్ (38), రోహిత్ (35) అందించిన శుభారంభాన్ని కీరన్ పొలార్డ్ (87*; 34 బంతుల్లో 6x4, 8x6) సద్వినియోగం చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడి కేవలం 34 బంతుల్లోనే 87 పరుగులతో ఆఖరి బంతికి విజయం అందించాడు.
Also Read: T20 World Cup: ధోనీని మించిన మెంటార్ గలడా? సిగ్గుపడేవాళ్లను అతడు గుర్తిస్తాడన్న వీరూ
జట్లు (అంచనా)
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఎంఎస్ ధోనీ (కె), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహీర్, లుంగి ఎంగిడి / హేజిల్‌వుడ్
ముంబయి: రోహిత్ శర్మ (కె), క్వింటన్ డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఆడమ్ మిల్నె / నేథన్ కౌల్టర్‌నైల్, జయంత్ యాదవ్ / రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా