(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup: ధోనీని మించిన మెంటార్ గలడా? సిగ్గుపడేవాళ్లను అతడు గుర్తిస్తాడన్న వీరూ
టీమ్‌ఇండియా మెంటార్‌గా ధోనీ ఎంపికవ్వడం జట్టుకు మేలు చేస్తుందని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు. బుమ్రా సహా అంతర్ముఖులైన బౌలర్లకు అతడి రాక ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మెంటార్‌గా ధోనీ ఎంపికవ్వడం జట్టుకు మేలు చేస్తుందని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు. జస్ప్రీత్ బుమ్రా సహా అంతర్ముఖులైన బౌలర్లకు అతడి రాక ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ, ముంబయి తన ఫేవరెట్ జట్లని వెల్లడించాడు.
'టీమ్‌ఇండియా మెంటార్‌గా ఎంఎస్ ధోనీ అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. భారత క్రికెట్ జట్టులోకి అతడు రావాలని చాలామంది ఆశించారు. మార్గనిర్దేశకుడిగా రావడంతో వారికి ఆనందం వేసింది. ఒక కీపర్‌గా ధోనీకి తిరుగులేదు. మ్యాచ్‌ను అర్థం చేసుకోవడం, ఫీల్డర్లను మోహరించడంలో అతడికున్న తెలివితేటలతో జట్టుకు మేలు జరుగుతుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఎలా బౌలింగ్ చేయాలో ధోనీ నుంచి సూచనలు పొందొచ్చు' అని సెహ్వాగ్ అన్నాడు.
వాస్తవంగా కుర్రాళ్లకు ధోనీని మించిన మార్గనిర్దేశకుడు దొరకడని వీరూ అంటున్నాడు. అంతర్ముఖులైన ఆటగాళ్లను మైదానంలో అతడు మెరుగ్గా నడిపిస్తాడని పేర్కొన్నాడు. 'అంతర్జాతీయ జట్లలో సిగ్గుపడే ఆటగాళ్లు ఉంటుంటారు. కెప్టెన్‌తో మాట్లాడేందుకు ఇబ్బంది పడతారు. అలాంటి వారిని గుర్తించి మాట్లాడటంలో ఎంఎస్‌కు అనుభవం ఉంది. సులభంగా అతడు కుర్రాళ్లతో కలిసిపోతాడు' అని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ముగ్గురు రిజర్వులను ఎంపిక చేసింది. అయితే అక్టోబర్ 10వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకొనేందుకు ఐసీసీ అవకాశమిచ్చింది. కాబట్టి యువకులు ఇప్పటికీ జట్టులోకి ఎంపికయ్యేందుకు ఛాన్స్ ఉందని వీరూ అంటున్నాడు.
'అవును, ఐపీఎల్‌లో ఏడు మ్యాచులు ఆడేంత వరకు సమయం ఉంది. అంటే అప్పటి వరకు ఎవరైనా అదరగొడితే, ఆకట్టుకుంటే కుర్రాళ్లకు అవకాశం రావొచ్చు. అందుకే జట్లలో మార్పులేమైనా వస్తే ఆశ్చర్యమేమీ లేదు' అని సెహ్వాగ్ అన్నాడు. విరాట్ కోహ్లీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని, బెంగళూరును గెలిపించాలన్న ఒత్తిడి అతడిపై ఉందని వెల్లడించాడు. రాబోయే నాలుగు వారాల్లో ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్నానన్నాడు. ఐపీఎల్ రెండో దశలో ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ తన ఫేవరెట్ జట్లని అంటున్నాడు.