(Source: ECI/ABP News/ABP Majha)
Kapil Dev on Virat Kohli: ఏం చేయాలో క్రికెటర్లే నిర్ణయించేస్తున్నారు.. అదే ఆశ్చర్యం అంటున్న కపిల్
క్రికెటర్లు నిర్ణయాలను ముందుగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. ఒక సీజన్లో బాగా ఆడనంత మాత్రాన అతడు గొప్ప క్రికెటర్, గొప్ప కెప్టెన్ కాకుండా పోడు అని కపిల్ అన్నాడు.
ఏం చేయాలో, ఏం చేయకూడదో క్రికెటర్లే నిర్ణయించుకోవడం విస్మయపరుస్తోందని టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ అన్నాడు. పనిభారం దృష్ట్యా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న అతడి నిర్ణయాన్ని స్వాగతించాడు. ఏదేమైనా అతడి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచిందని వెల్లడించాడు.
'నేనైతే ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. కానీ ఈ రోజుల్లో క్రికెటర్లే ఏం చేయాలో.. ఏం చేయకూడదో నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం వేస్తోంది. ఈ విషయంపై సెలక్టర్లు ఏమైనా మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తోంది. కానీ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకొనే ముందు సెలక్టర్లు, బోర్డును ముందుగా సంప్రదిస్తే మంచిది. ఇది చాలా కీలకం. అయితే ముందుగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. ఒక సీజన్లో బాగా ఆడనంత మాత్రాన అతడు గొప్ప క్రికెటర్, గొప్ప కెప్టెన్ కాకుండా పోడు' అని కపిల్ ఏబీపీ న్యూస్‌తో అన్నాడు.
కెప్టెన్సీ వదులుకోవడంపై గంగూలీ, జే షా, రవిశాస్త్రి, రోహిత్‌తో మాట్లాడానని చెప్పినా విరాట్ వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకున్నాడని కపిల్ భావిస్తున్నాడు. 'అతడు సెలక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఫర్వాలేదు. ఏదేమైనా అతడిది వ్యక్తిగత నిర్ణయం. దానిపై ఎక్కువగా మాట్లాడను. ఏం చేయాలో, ఏం చేయొద్దనుకుంటున్నారో ఈ రోజుల్లో క్రికెటర్లు సొంతంగా నిర్ణయించుకుంటున్నారు. ఏదేమైనా అతడు దేశానికి గొప్ప సేవ చేశాడనే చెబుతాను. మిగతా కెరీరూ బాగుండాలని కోరుకుంటాను' అని కపిల్ తెలిపాడు.
'మనం కోహ్లీ నిజాయతీని గౌరవించాలి. పొట్టి ఫార్మాట్లో సారథ్యం వదిలేయాలని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అతడు ట్వీట్ల ద్వారా ఈ విషయం తెలియజేయాలని అనుకోవడమే వింతగా అనిపించింది. కొన్నాళ్ల తర్వాత ఆడలేనని లేదా ఐపీఎల్ మాత్రమే ఆడతానని, కేవలం టీ20లు మాత్రమే ఆడతానని ఈ రోజుల్లో క్రికెటర్లు చెప్పేస్తున్నారు. ఇవన్నీ చెప్పేంత ధైర్యం వారికి ఉండటం అభినందనీయమే' అని కపిల్ వెల్లడించాడు.