WTC Final 2023: పదేళ్లుగా ఐసీసీ టైటిల్ లేదు - ఆసీస్‌ను ఓడించి హిట్‌మ్యాన్ రికార్డు కొట్టేనా!!
WTC Final 2023: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు వేళైంది! ఆఖరి సమరంలో నువ్వా నేనా తేల్చుకొనేందుకు భారత్, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. బుధవారమే ఓవల్ వేదికగా ఆట మొదలవుతుంది.
WTC Final 2023:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు వేళైంది! ఆఖరి సమరంలో నువ్వా నేనా తేల్చుకొనేందుకు భారత్, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. మరో ఐసీసీ టైటిల్ గెలుచుకొనేందుకు పట్టుదలగా ఉన్నాయి. బుధవారమే ఓవల్ వేదికగా ఆట మొదలవుతుంది. మరి గెలిచేదెవరు? ఆధిపత్యం ఎవరిది?
టీమ్‌ఇండియా జర్నీ!
ఛాంపియన్‌షిప్ ప్రవేశపెట్టాక టెస్టు క్రికెట్‌కు జోష్ వచ్చింది! ప్రతి జట్టూ ఫలితం కోసం ఆఖరి వరకూ పోరాడుతున్నాయి. పాయింట్లు గెలిచి ఫైనల్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండేళ్లు జరిగిన ఈ రెండో సైకిల్‌లో ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా వరుసగా 1, 2 స్థానాలు కైవసం చేసుకున్నాయి. హిట్‌మ్యాన్ సేన మొత్తం 18 మ్యాచులు ఆడి 10 విజయాలు సాధించింది. 5 మ్యాచుల్లో ఓడి మూడింటిని డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించడం చరిత్రలోనే అరుదైన సన్నివేశం. ఇక ఆసీస్‌ను ఓ ఆటాడుకుంది. ఎప్పట్లాగే దక్షిణాఫ్రికాలో ఇబ్బంది పడింది. న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌పై ఈజీగా గెలిచేసింది.
పదేళ్ల కొరత.. తీరుస్తారా!
టీమ్‌ఇండియా ఐసీసీ టైటిల్ గెలిచి పదేళ్లు అవుతోంది. చివరి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కొద్దిలో 'గద'ను మిస్ చేసుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసి కనిపిస్తోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ క్లాస్ టచ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ అతడిలో ఉత్సాహం నింపింది. రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ బుర్రకు పదును పెట్టాల్సి ఉంది. చెతేశ్వర్ పుజారా కౌంటీ క్రికెట్ ఆడుతూ ఇంగ్లాండ్ పిచ్‌లు, వాతావరణాన్ని ఔపోశన పట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో విజృంభించిన విరాట్ కోహ్లీకి ఓవల్‌లో సూపర్ రికార్డు ఉంది. అజింక్య రహానె, రవీంద్ర జడేజా తమ స్థాయి ఇన్నింగ్సులు ఆడితే మంచిది. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. ప్రాక్టీస్‌ను బట్టి కిషన్ తుది జట్టులోకి వస్తాడని సమాచారం. పైగా ఎక్స్‌ఫ్యాక్టర్‌గా ఉండగలడు. మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ ద్వయం జోష్‌లో ఉంది. వీరిద్దరూ దూకుడుగా బౌలింగ్ చేస్తే తిరుగుండదు. వీరికి తోడుగా ఉమేశ్ ఉంటాడు. పిచ్‌ను బట్టి నాలుగో పేసర్‌గా శార్దూల్ వస్తాడు. లేదంటే యాష్‌కు అవకాశం దొరుకుతుంది. రెండు రోజులుగా టీమ్‌ఇండియా స్లిప్ క్యాచింగ్ బాగా ప్రాక్టీస్ చేసింది.
ఆసీస్.. డేంజరస్!
ప్రపంచంలో ఎక్కడ ఆడినా ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయొద్దు! ఆ జట్టును ఓడించడం అంత ఈజీ కాదు! ఇంగ్లాండ్‌లో డేవిడ్ వార్నర్‌కు మెరుగైన రికార్డు లేకపోవడం టీమ్‌ఇండియాకు ప్లస్‌పాయింట్. అయితే స్టీవ్‌స్మిత్‌కు ఓవల్ మైదానం కొట్టిన పిండి. అతడిని ఔట్ చేయకపోతే సునాయాసంగా పరుగులు చేస్తాడు. రోజుల కొద్దీ క్రీజులో నిలుస్తాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా చాలా డేంజరస్ ప్లేయర్. మార్నస్ లబుషేన్ వన్‌డౌన్ల ఎలా ఆడతాడో తెలిసిందే. స్పిన్‌లో అతడికి కొంత బలహీనత ఉంది. ట్రావిస్ హెడ్ మాత్రం వేగంగా పరుగులు చేస్తాడు. స్పిన్, పేస్ రెండూ ఆడతాడు. అతడి వికెట్ కీలకం. మిడిలార్డర్లో అలెక్స్ కారీ ఉంటాడు. జోష్ హేజిల్‌వుడ్ లేకపోవడం మైనస్ పాయింట్. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ జాన్సన్, దేశవాళీ దిగ్గజం స్కాట్ బొలాండ్ పేస్‌తో వణికించగలరు. నేథన్ లైయన్ ఎన్ని ఓవర్లైనా స్పిన్ వేయగలడు. పిచ్‌ను బట్టి టాడ్ మర్ఫీ బరిలోకి దిగుతాడు.
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేశ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టాయినిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా