WPL 2023 Final: ఫస్ట్ ట్రోఫీ ఎవరికి? ఫైనల్లో దిల్లీని ఢీకొట్టేందుకు ముంబయి రెడీ!
WPL 2023 Final: విమెన్ ప్రీమియర్ లీగులో ఆదివారమే ఆఖరి పోరు. ఇన్నాళ్లూ సివంగుల్లా పోటీపడ్డ ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ అరంగేట్రం ట్రోఫీపై కన్నేశాయి!
WPL 2023 Final:
నిన్న మొన్ననే మొదలైనట్టుంది! అప్పుడే ముగింపుకొచ్చేసింది! విమెన్ ప్రీమియర్ లీగులో ఆదివారమే ఆఖరి పోరు. ఇన్నాళ్లూ సివంగుల్లా పోటీపడ్డ ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ అరంగేట్రం ట్రోఫీపై కన్నేశాయి! తొలి కప్పు ముద్దాడి చరిత్ర సృష్టించాలన్న కసితో కనిపిస్తున్నాయి. బ్రబౌర్న్ వేదికగా తలపడుతున్నాయి. మరి ఇందులో గెలిచేది ఎవరు? తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయి?
రెండూ సమవుజ్జీలే!
విమెన్ ప్రీమియర్ లీగుకు ఆకర్షణగా మారిన రెండు ఫ్రాంచైజీలు ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్! రెండింట్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా క్రికెటర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వ్యూహాల్లో సమానంగా కనిపిస్తున్నారు. లీగు దశలో రెండూ సమానంగా మ్యాచులు గెలిచాయి. కొద్దిగా రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో మెగ్ లానింగ్ సేన నేరుగా ఫైనల్ చేరుకుంది. హర్మన్‌ప్రీత్ బృందం ఎలిమినేటర్లో యూపీ వారియర్జ్‌ను చిత్తుగా ఓడించి సింహనాదం చేసింది. మొదటి లీగ్ మ్యాచులో దిల్లీని 105కు ఆలౌట్ చేసిన ముంబయి 15 ఓవర్లకే 8 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో లీగులో ముంబయిని 109కి పరిమితం చేసిన దిల్లీ జస్ట్ 9 ఓవర్లకే 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను ఫినిష్ చేసి దెబ్బకొట్టింది.
లానింగ్.. బిగ్ మ్యాచెస్ కెప్టెన్!
ఫైనల్ గెలిచేందుకు దిల్లీ క్యాపిటల్స్‌కు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియాకు నాలుగుసార్లు టీ20 ప్రపంచకప్ అందించిన మెగ్ లానింగే ఈ జట్టుకూ కెప్టెన్! వ్యూహాలు రచించడం, అమలు చేయడంలో ఆమెను మించినోళ్లు లేరు. సందర్భానికి తగినట్టుగా బౌలర్లు, ఫీల్డర్లను మార్చేస్తుంది. పైగా ఇండియన్ పిచ్‌లపై ఎంతో అవగాహన ఉంది. జట్టుపై పూర్తి పట్టు సాధించేసింది. 8 మ్యాచుల్లో 51 సగటు, 141 స్ట్రైక్‌రేట్‌తో 310 పరుగులతో భీకరమైన ఫామ్‌లో ఉంది. ఆమెకు తోడుగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్మురేపుతోంది. 182 స్ట్రైక్‌రేట్‌తో 241 రన్స్ చేసింది. అలిస్ క్యాప్సీ, మారిజానె కాప్ దంచికొడుతున్నారు. ఎలాంటి సిచ్యువేషనైనా జెమీమా నిలబడగలదు. జొనాసెన్, తానియా భాటియా సిక్సర్లు బాదేస్తారు. బౌలింగ్‌లోనూ తిరుగులేదు. శిఖా పాండే, కాప్, అరుంధతీ రెడ్డి మంచి బౌలింగ్ చేస్తున్నారు. రాధా యాదవ్, జొనాసెన్, పూనమ్ స్పిన్‌తో మాయ చేస్తారు. దిల్లీలో ఏ ఇద్దరు బ్యాటర్లు నిలబడ్డా స్కోరు 180 దాటడం ఖాయం!
హర్మన్.. గొప్ప నాయకి!
సొంత మైదానం.. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్.. అన్నీ తెలిసిన హర్మన్ ప్రీత్ కెప్టెన్‌గా ఉండటం ముంబయి ఇండియన్స్ బలం! ఇక్కడి పిచ్‌లు ఎప్పుడెలా స్పందిస్తాయో ఆమెకు బాగా తెలుసు. ప్రత్యర్థి బ్యాటర్లు, బౌలర్లు వీక్‌నెస్‌లపై దెబ్బకొట్టగలదు. పైగా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఆడగిలిగే క్రికెటర్లు ఉన్నారు. స్వయంగా ఆమే మంచి ఫామ్‌లో ఉంది. ఎలిమినేటర్లో వికెట్ల పతనం ఆపింది. ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, హర్మన్ ప్రీత్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. టాప్ ఐదుగురిలో ఇద్దరు నిలిస్తే చాలు మంచి స్కోర్ వస్తుంది. మిడిలార్డర్లో పూజా, వాంగ్ రాగానే సిక్సర్లు బాదేస్తారు. బౌలింగ్‌లోనూ ముంబయికి తిరుగులేదు. సైకా ఇషాకి (15 వికెట్లు), మాథ్యూస్ (13 వికెట్లు) స్పిన్‌తో ప్రత్యర్థిని చుట్టేస్తున్నారు. ఇస్సీ వాంగ్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తే హడలెత్తిస్తోంది. నాట్ సివర్ పేస్‌లో మంచి వేరియేషన్స్ చూపిస్తోంది. పేస్‌తో వస్త్రాకర్, స్పిన్‌తో కెర్ వీరికి అండగా ఉన్నారు. అయితే ముంబయి వీక్‌నెస్ ఏంటో దిల్లీకి బాగా తెలుసు!
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్ : హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్
ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ , జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, తానియా భాటియా (వికెట్ కీపర్), జెస్ జొనాసెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్
Dominant @DelhiCapitals will take on the mighty @mipaltan in the inaugural #TATAWPL final 🏆
— Women's Premier League (WPL) (@wplt20) March 25, 2023
Tune in tomorrow & watch LIVE on @JioCinema and @Sports18 pic.twitter.com/9pbcAQKa6x