Shubman Gill: రోహిత్, కోహ్లీలను దాటి కొత్త రికార్డు, కొనసాగుతున్న గిల్ దూకుడు
Shubman Gill Records:: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారీ స్కోర్లు చేయకపోయినా ఆరంభంలో ధాటిగా ఆడుతూ భారత్ భారీ స్కోరు చేయడంలో స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 1998లో క్రికెట్ గాడ్ సచిన్ 1894 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 1999లో 1767 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉండగా ది వాల్ 1761 పరుగులు చేశాడు. సచిన్ మళ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 1996లో మరోసారి మాస్టర్ బ్లాస్టర్ 1611 పరుగులు చేశాడు. శుభ్‌మన్ ఈ ఏడాది వన్డేల్లో 1500 పరుగులు చేశాడు. ఈ విషయంలో రోహిత్, కోహ్లిలను గిల్ వెనక్కినెట్టాడు. 2019లో రోహిత్ 1490 పరుగులు చేయగా.. 2017లో కోహ్లీ 1460 పరుగులు చేశాడు. వీరిద్దరిని అధిగమించి గిల్ 1500 పరుగులు చేసి సత్తా చాటాడు.
శుభ్‌మన్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల విభాగంలో భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ 830 పాయింట్లతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను వెనక్కు నెట్టాడు. 824 పాయింట్లతో బాబర్ రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి క్రికెట్ దేవుడు, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని, కింగ్ కోహ్లి తర్వతా వన్డే క్రికెట్లో నంబర్‌వన్ బ్యాటర్ నిలిచింది శుభ్‌మన్ గిల్ ఒక్కడే. ప్రపంచ నంబర్‌వన్ వన్డే ఆటగాడిగా ఎదిగిన అతను.. సచిన్, ధోని, కోహ్లి తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. 1988లో వన్డే ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టగా ఇప్పటివరకూ భారత్ నుంచి కేవలం నలుగురు బ్యాటర్లే నంబర్‌వన్‌గా నిలిచారు. అందులో గిల్ ఒకడు. ఇప్పటివరకూ గిల్ 41 వన్డేల్లో 61.02 సగటుతో 2136 పరుగులు చేశాడు. ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక వేగంగా 38 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా గిల్ రికార్డు సృష్టించాడు.
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్, టీమిండియా పేస్ స్టార్ మహ్మద్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి... సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్ నిలిచాడు. సెప్టెంబర్ నెలలో గిల్‌ను బెస్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసినట్లు ఐసీసీ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ నెలలో శుభ్‌మన్ అద్భుతమైన బ్యాటింగ్‌త అదరగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్ 80 సగటుతో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్ నిలిచాడు. ఆసియా కప్‌లో 75.5 బ్యాటింగ్ సగటుతో ఈ స్టార్ ఓపెనర్ 302 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో గిల్ 178 పరుగులు చేశాడు.