World Cup 2023: ఆసక్తికరంగా మారిన సెమీస్ పోరు - ఒక్క చోటు కోసం మూడు జట్ల పోటీ!
World Cup 2023 Semi Finals: 2023 ప్రపంచ కప్ సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది.
World Cup Points Table: ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగుస్తున్న తరుణంలో సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో మూడో జట్టుగా ఆస్ట్రేలియా బలంగా ఉంది. ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించింది. కంగారూ జట్టుకు ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అయితే నాలుగో స్థానం కోసం అత్యంత ఆసక్తికరమైన పోరు సాగుతోంది.
నాలుగో స్థానానికి పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, పాకిస్తాన్ ఐదో స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ, ఈ మూడు జట్లు ఎనిమిదేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి.
ఆస్ట్రేలియా 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ +0.924గా ఉంది. నాలుగో ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది పాయింట్లను సాధించింది. అలాగే నెట్ రన్ రేట్ +0.398గా ఉంది. ఐదో ర్యాంక్‌లో ఉన్న పాకిస్తాన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లు, +0.036 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఆరో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఏడు మ్యాచ్‌లలో 8 పాయింట్లు, -0.330 నెట్ రన్ రేట్‌తో ఉంది. అయితే పాకిస్తాన్, న్యూజిలాండ్ కంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ తక్కువగా ఆడింది.
నిష్క్రమించిన ఇంగ్లండ్
ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ తర్వాత నిష్క్రమించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న శ్రీలంక ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఉంది. కాగా ఈ జట్టు నెట్ రన్ రేట్ -1.162గా ఉంది. ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న నెదర్లాండ్స్ ఏడు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లను కలిగి ఉంది. వారి నెట్ రన్ రేట్ -1.398గా ఉంది.
మరోవైపు ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరంలో ఆస్ట్రేలియా జట్టే పైచేయి సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి గౌరవప్రదమైన స్కోరు చేసిన కంగారులు ఆ తర్వాత ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. 49.3 ఓవర్లలో కేవలం 286 పరుగులకే ఆలౌట్ చేసి విజయం సాధించేలా కనిపించింది. కానీ టాప్ ఆర్డర్ వైఫల్యంతో బ్రిటీష్ జట్టు మరో అపజయాన్ని మూటగట్టుకుంది. 48.1 ఓవర్లలో కేవలం 253 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ పరాజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలోనే కొనసాగుతోంది. ఈ ఓటమితో ఇంగ్లండ్ ఛాంపియన్స్ కప్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. పాయింట్ల పట్టికలో తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లకు మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయి.
Six teams are still in contention for the two final #CWC23 semi-final spots 👀
— ICC Cricket World Cup (@cricketworldcup) November 4, 2023
Here’s what each nation needs to qualify 📝⬇️https://t.co/7upSxePJxc