(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma: అన్ని ప్రశ్నలకు ఒక్క గెలుపుతో సమాధానం , లక్ష్యం దిశగా సాగుతున్నామన్న రోహిత్
ODI World Cup 2023: భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయంతో భారత జట్టు సెమీస్ చేరింది.
భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయంతో భారత జట్టు సెమీస్ చేరింది. అద్భుతాలు జరిగితే తప్ప టీమిండియా నాకౌట్‌కు చేరడం ఖాయమే. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇప్పటివరకు భారత్ గెలిచిన అయిదు మ్యాచుల్లోనూ మొదటే బ్యాటింగ్ చేసింది. అయితే రోహిత్ సేన తొలుత బ్యాటింగ్ చేస్తే బ్యాటర్లు రాణించగలరా... ఒకవేళ మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత టీమిండియా బ్యాట్సమెన్ ఎంత లక్ష్యాన్ని నిర్దేశించగలరు... కఠినమైన పిచ్‌పై ఓపికతో బ్యాటింగ్ చేయగలరా... తక్కువ లక్ష్యాన్ని భారత బౌలింగ్ దళం కాపాడుకోగలదా ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ మ్యాచ్‌తో టీమిండియా సమాధానం ఇచ్చేసింది. కఠినమైన పిచ్‌పై తొలుత అద్భుతంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత బౌలర్లు అదరగొట్టారు. ఈ విజయంతో టీమిండియాకు ఈసారి కప్పు ఖాయమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
తమ జట్టులో చాలామంది మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారని రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. సీనియర్ ఆటగాళ్లందరూ సరైన సమయంలో సత్తా చాటి జట్టును విజయతీరాలకు చేర్చారని కొనియాడాడు. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి బ్యాటింగ్ చేయడంపై రోహిత్ స్పందిస్తూ... తాము మొదటి అయిదు మ్యాచుల్లో లక్ష్యాన్ని ఛేదించామని ఈసారి మొదట బ్యాటింగ్ సవాలును స్వీకరించామని తెలిపాడు. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్న రోహిత్... బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉన్న పిచ్‌పై తాము మంచి స్కోరు చేశామన్నాడు. ఇలాగే సానుకూల దృక్పథంతో ఆడి ఈ టోర్నమెంట్‌లో అద్భుతాలు సృష్టించాలనుకుంటున్నామని అన్నాడు. బ్యాట్సమెన్ కొందరు త్వరగా వికెట్లు కోల్పోయినా తాము తర్వాత ఇన్నింగ్స్ నిర్మించామని హిట్ మ్యాన్ గుర్తు చేశాడు. తాము బ్యాటింగ్ బాగా చేయలేదని అంగీకరించిన రోహిత్.. ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నాడు. త్వరగా మూడు వికెట్లు కోల్పోవడం మంచి పరిస్థితి కాదుని... అలా వికెట్లు పడ్డప్పుడు భారీ భాగస్వామ్యాన్ని నిర్మించడం ముఖ్యమని అన్నాడు. అయినా ఈ మ్యాచ్‌లో అనుకున్న దానికంటే తాము 30 పరుగులు తక్కువ చేసినట్లు రోహిత్ తెలిపాడు.
టీమిండియా బౌలింగ్ విభాగం కొత్త బంతితో అద్భుతాలు సృష్టిస్తుందని రోహిత్ అన్నాడు. సీమర్లు మెరుగ్గా రాణిస్తున్నారని తెలిపాడు. స్పిన్నర్లు బంతితో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారని హిట్‌మ్యాన్ తెలిపాడు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను రోహిత్ సేన మట్టికరిపించింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్...నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత్ బౌలర్లు చుట్టేశారు. కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే బ్రిటీష్ జట్టు కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్.. ప్రపంచకప్ సెమీఫైనల్‌కు కూడా దూసుకెళ్లింది. వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్‌గా తన వందో మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించాడు. ఆచితూడి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు ఆడేందుకు భయపడలేదు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను అదిల్ రషీద్ అవుట్ చేశాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో రోహిత్ శర్మ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.