![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Harmanpreet Kaur: అంజుమ్‌ను హత్తుకొని వలవలా ఏడ్చేసిన హర్మన్! వీడియో చూస్తే మనకూ కన్నీరే!
Harmanpreet Kaur: టీమ్‌ఇండియా ఓటమితో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ భావోద్వేగానికి గురైంది. ఏడుస్తూనే ఉంది. మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆమెను ఓదార్చింది.
![Harmanpreet Kaur: అంజుమ్‌ను హత్తుకొని వలవలా ఏడ్చేసిన హర్మన్! వీడియో చూస్తే మనకూ కన్నీరే! Women's T20 WC 2023 Harmanpreet Kaur bursts into tears after ex-captain Anjum Chopra's gesture following IND loss to AUS Harmanpreet Kaur: అంజుమ్‌ను హత్తుకొని వలవలా ఏడ్చేసిన హర్మన్! వీడియో చూస్తే మనకూ కన్నీరే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/24/1481db59be884222a0faa61a537b854f1677220903848251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Harmanpreet Kaur:
ఇప్పటికి ఎన్ని ఫైనళ్లు.. ఎన్ని సెమీ ఫైనళ్లు గడిచాయో! గెలవడం కష్టమే అనుకొనే స్థితిలో అసాధారణంగా పోరాడటం. విజయానికి చేరువ కావడం. ఆఖర్లో ఒత్తిడికి గురై ఓటమి చవిచూడటం! కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టు ఒరవడి ఇదే!
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సెంటిమెంటు కొనసాగింది. కప్పు ముద్దాడాలన్న కలకు టీమ్‌ఇండియా త్రుటిలో దూరమవుతోంది. అయితే ఆస్ట్రేలియా లేదంటే ఇంగ్లాండ్! భారత అమ్మాయిలను కంటనీరు పెట్టిస్తూనే ఉన్నాయి.
గురువారం ఆస్ట్రేలియాతో సెమీస్‌లో ఓటమి పాలయ్యాక టీమ్‌ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వలవలా ఏడ్చేసింది. ఇంకా ఎన్ని ఓటములను భరించాలోనన్న దిగులుతో బెంగపడింది. రనౌటైన క్షణం నుంచీ ఆమె కళ్లు చెమ్మగిల్లే ఉన్నాయి. ఆవేశం, ఆక్రోషం, ఆక్రందన, బాధ, భయం ఇలాంటి మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో కనిపించింది.
View this post on Instagram
సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ అసాధారణంగా పోరాడింది. 34 బంతుల్లో 52 పరుగులు చేసింది. ఆమె మరికాసేపు క్రీజులో ఉంటే గెలుపు ఖాయం. 6 వికెట్లున్నాయి. 33 బంతుల్లో 41 పరుగులు చేస్తే చాలు. ఇలాంటి దశలో ఆమె రనౌట్ కావడం 2019 పురుషుల వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ధోనీ ఔటైన తీరును గుర్తు చేసింది. అభిమానులకు అంతులేని వ్యధను మిగిల్చింది.
ఆమెకు తెలుసు! తానుంటే మ్యాచ్ గెలిపించగలనని! ఒత్తిడిని అధిగమించగలనని! ప్చ్..! ఏం చేస్తాం! నమ్మశక్యం కాని విధంగా ఆమె రనౌట్ అయింది. బిగ్‌స్క్రీన్‌పై ఔట్ అనే అక్షరాలు కనిపించగానే ఆవేదన, ఆవేశం, బాధకు లోనైన హర్మన్ బ్యాటును గాల్లోకి విసిరేసింది. డ్రెస్సింగ్ రూమ్ మెట్లెక్కుతూ బ్యాటును విసిరిగొట్టింది. ఆ తర్వాత పోరాడిన దీప్తి శర్మా ఇలాగే చేసింది. మీడియా సమావేశానికి వచ్చినప్పుడూ హర్మన్ భావోద్వేగంలోనే ఉంది.
హర్మన్ బాధను గమనించిన టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ అంజుమ్ చోప్రా ఆమె దగ్గరకు వెళ్లింది. ఆమెను హత్తుకుంది. ఓ అక్కలా ఆమెను ఓదార్చింది. ఇలాంటి ఓటములను తానూ చవిచూశానని గుర్తు చేసింది. సముదాయించింది. ఆమె కౌగిలిలో ఒదిగిపోయిన హర్మన్ బిగ్గరగా ఏడ్చేసింది. దాంతో యువ క్రికెటర్ హర్లీన్ డియోల్ ఆమె కన్నీళ్లను తుడిచేస్తూ ఊరడించింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
'కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు సహానుభూతి తెలపడమే నా ఉద్దేశం. బయట నుంచి నేను చేయగలిగింది అదే. ఇది మా ఇద్దరికీ భావోద్వేగ సన్నివేశం. టీమ్‌ఇండియా చాలాసార్లు సెమీస్‌కు చేరుకొని ఓడిపోయింది. హర్మన్ అస్వస్థతతో బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఆమె గాయాలు, అనారోగ్యంతో పోరాడటం చూశాను. నిజానికి ఆమె ఈ రోజు ఆడకూడదు. కానీ ప్రపంచకప్ సెమీస్ కోసం తప్పలేదు. ఆమెప్పుడూ వెనకడుగు వేయదు. అనారోగ్యంతో ఉన్నా 20 ఓవర్లు ఫీల్డింగ్ చేసింది. ఆపై బ్యాటింగ్ చేసింది. ఆమె బాధను ఎంతో కొంత తగ్గించేందుకు ప్రయత్నించా' అని అంజుమ్ చెప్రా పేర్కొంది.
IND vs AUS Womens T20 World Cup Semi Final: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంలో భారత్ విఫలం అయింది. చివరి బంతి వరకు పోరాడినప్పటికీ విజయానికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 167 పరుగులకే పరిమితం అయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)