Gautam Gambhir : కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు- విభేదాలపై నోరు విప్పిన కోచ్ !
India@2047 Summit :విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు వెళతారో లేదో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పారు? ఏబీపీ నిర్వహించే ఇండియా@2047 సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Gautam Gambhir: ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా@2047 సమ్మిట్ "టీమ్ ఇండియా - ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్" అనే సెషన్‌ను ఎంతో ఆసక్తిగా సాగింది. ఇందులో మాజీ క్రికెటర్, ప్రస్తుత టీం ఇండియా మెయిన్ కోచ్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నారు. ఈ సెషన్ గంభీర్ కోచ్‌గా ప్రయాణం, భవిష్యత్తు పట్ల అంచనాలు, టీంను నడిపించడంలో సవాల్‌లు అన్నింటిపై మాట్లాడారు. అద్భుతమైన ప్రారంభంతో కోచింగ్ పదవి చేపట్టిన గంభీర్ శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన పరాజయాలు గంభీర్‌పై విమర్శలకు కారణయ్యాయి. తర్వాత దుబాయ్‌లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం దిశగా భారత్‌ను నడిపించారు.
కామెంటరీ బాక్స్‌లో కూర్చుని తనను ప్రశ్నించేవారు భారత క్రికెట్‌ను వారి కుటుంబ ఆస్తిగా భావిస్తారని అన్నారు. గాజు ఇంట్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్ళు విసిరే ముందు 10 సార్లు ఆలోచించాలని సూచించారు. మేఘా ప్రసాద్‌తో జరిగిన సంభాషణలో గంభీర్ గత ప్రయాణం గురించి, ఆటగాడి నుంచి కోచ్‌గా మారడంలో సవాళ్లు, ఒత్తిళ్ల నిర్వహణలో సమతుల్యత, నాయకత్వంపై ఫిలాసఫీ వివరించారు. 'కొంతమంది' వ్యాఖ్యాతలు, నిపుణులు తనను, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా తన పదవీకాలాన్ని విమర్శించడానికి ఏ అవకాశాన్ని ఎలా వదులుకోలేదో వివరించడంతోనే గంభీర్ ప్రసంగం ప్రారంభించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయనే పుకార్లకు చెక్ పెట్టారు. సెషన్ అంతటా గౌతమ్ గంభీర్ అనేక ప్రశ్నలు సంధించారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను తాను మిస్ అవ్వనని చెప్పారు.
రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయని అడిగితే... "ముందుగా ఇలాంటి ప్రశ్నలు అడిగే వ్యక్తులు ఎవరు అని నేను అడగాలనుకుంటున్నాను? సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతున్న వ్యక్తులు తమ TRPని పెంచుకోవడానికి ఇది చెబుతున్నారు."
2 నెలల క్రితం టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని గంభీర్ అన్నారు. "మనం ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే, మీడియాలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవారో నాకు తెలియదు" అని అన్నారు. భారత జట్టు కోచ్, కెప్టెన్ కలిసి 2 నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారని, అయినప్పటికీ అలాంటి ప్రశ్నలు అడగడం సరైనది కాదని గంభీర్ అన్నారు.
నేను రోహిత్‌ను గౌరవిస్తాను...
"రోహిత్ శర్మ భారత క్రికెట్‌కు చేసిన దాని సేవ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. రోహిత్ జట్టులోకి వచ్చినప్పుడు కూడా గౌరవంగా చూశాను. భవిష్యత్తులో కూడా నా ఆలోచన అలాగే ఉంటుంది. TRP పెంచడానికి అలాంటి ప్రశ్నలు అడిగే వ్యక్తులు తమ పరిశోధనను సరిగ్గా చేయాలి" అని అన్నారు.
IPL 2025 ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఆ తర్వాత టీం ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టు ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానంపై అనుమానాలు ఉన్నాయి. ఇదే ప్రశ్న గంభీర్‌ను ABP న్యూస్ అడిగింది.
దీనికి సమాధానంగా గౌతీ మాట్లాడుతూ... జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని జట్టులో చేర్చుకోవడం తన చేతుల్లో లేదని అన్నారు. కోచ్‌గా తన పని జట్టు నుంచి ఉత్తమ ప్లేయింగ్-11ని సిద్ధం చేయడమేనని గంభీర్ తెలిపారు.
"కోచ్ మాత్రమే జట్టును సిద్ధం చేస్తాడనే ఈ నమ్మకాన్ని తొలగించండి. నా కంటే ముందు ఉన్న కోచ్‌లు జట్టును ఎంపిక చేసేవారు కాదు, నేను కూడా అలా చేయను. సెలెక్టర్లు నా కంటే బాగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేవారు."
టీమ్ ఇండియా బ్లూప్రింట్
గౌతమ్ గంభీర్ రాబోయే 2 సంవత్సరాలు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు. అటువంటి పరిస్థితిలో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బ్లూప్రింట్‌లో తాను తయారు చేసిన జట్టులో స్థానం ఇచ్చారా లేదా అని కూడా గంభీర్‌ను అడిగింది ఏబీపీ.
"ఇద్దరూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే, విరాట్, రోహిత్ కచ్చితంగా టీమ్ ఇండియాలో భాగంగా ఉంటారు. మీరు మీ కెరీర్‌ను ఎప్పుడు ప్రారంభించి ముగించాలి అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. మీ కెరీర్ ఎప్పుడు ముగియాలో ఏ BCCI, కోచ్ లేదా సెలెక్టర్ మీకు చెప్పలేరు. ఎవరూ మిమ్మల్ని బ్యాన్ చేయలేరు. మీరు ఫిట్‌గా ఉంటే, 40, 45 సంవత్సరాల వయస్సు వరకు ఆట కొనసాగించవచ్చు."
తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై గంభీ ఘాటుగా స్పందించారు. ఇలాంటివి తాను ఎప్పుడో ఊహించానని అన్నారు. కానీ 'భారతదేశాన్ని గర్వపడేలా' చేయాలనే తన ఉద్దేశ్యం నుంచి ఎప్పుడూ మరలలేదన్నారు. అది తన కెరీర్ చివరి రోజు వరకు ఉంటుందని గౌతమ్ అన్నారు.
"నా ప్రయాణం ఎల్లప్పుడూ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంటుంది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నా ఉద్యోగం ప్రశంసలు, విమర్శలను ఎదుర్కొంది. నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను, ఎందుకంటే గ్రాఫ్ ఎల్లప్పుడూ హెచ్చు తగ్గులను చూస్తుంది."
"నా కోచింగ్ కెరీర్‌లో కేవలం 8 నెలలకే విమర్శలను నేను స్వాగతిస్తున్నాను. అయినా సరే బాగానే ఉన్నాను. కానీ 20-25 సంవత్సరాలుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న కొంతమంది వ్యక్తులు నా ప్రతి చర్యను ప్రశ్నిస్తూనే ఉ్నారు. "
"వారు 'భారత్ క్రికెట్ వాళ్ల సొంత జాగీర్ అనుకుంటున్నారు' పూర్తిగా తప్పు భారత క్రికెట్ ఈ దేశంలోని 140 కోట్ల జనాభాకు చెందినది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది."
"నా కోచింగ్ నుంచి, నా బ్యాటింగ్ రికార్డుల వరకు, నా కంకషన్ వరకు, వారు ప్రతిసారీ నాపై ప్రశ్నలు సంధించారు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత జట్టుకు కేటాయించిన బహుమతి డబ్బుపై కూడా. ఈ దేశంలోని అందరికీ నేను నా వస్తువులను ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఉంచానో చెప్పనవసరం లేదు, కానీ దేశంలో నివసిస్తున్నప్పుడు డబ్బు సంపాదించి, ఆపై వారి ఇష్టానుసారం వెళ్లిపోతున్న NRIలు చాలా మంది ఉన్నారు."
"నేను నా చివరి శ్వాస వరకు భారతీయుడిగా ఉంటాను పన్ను ఆదా చేయడానికి నేను NRIని కాను."అని అన్నారు.




















