India vs West Indies: పతనావస్థలో ఉన్న విండీస్ ను లారా గట్టెక్కించేనా? - వెస్టిండీస్ దిగ్గజానికి కీలక బాధ్యతలు
ఐసీసీ వన్దే వరల్డ్ కప్ కు క్వాలిఫై కావడంలో విఫలమైన వెస్టిండీస్ జట్టుకు త్వరలో భారత్ తో జరిగే మూడు ఫార్మాట్ సిరీస్ కీలకం కానుంది.
India vs West Indies: 48 ఏండ్ల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి వెస్టిండీస్ లేకుండానే భారత్ లో అక్టోబర్ నుంచి మెగా టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా లీగ్ స్టేజ్ లో నెదర్లాండ్స్, సూపర్ సిక్సెస్ లో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన వెస్టిండీస్ ఈనెల 12 నుంచి భారత్ తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్ లలో అయినా మెరుగైన ప్రదర్శనలు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) కీలక నిర్ణయం తీసుకుంది. విండీస్ మాజీ సారథి, దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారాను మెంటార్ గా నియమించింది.
ఈనెల 12 నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు.. భారత్ తో డొమినికా వేదికగా జరుగబోయే తొలి టెస్టులో ఆడనుంది. ఈ మేరకు ఇదివరకే అందుబాటులో ఉన్న క్రికెటర్లతో అంటిగ్వాలో ట్రైనింగ్ క్యాంప్ ను నిర్వహిస్తున్నది. ఈ క్యాంప్ లో బ్రియాన్ లారా కూడా పాల్గొంటున్నాడు. భారత బౌలర్లను ఎదుర్కునేందుకు గాను అతడు విండీస్ బ్యాటర్స్ కు కీలకమైన టిప్స్ చెబుతున్నాడు. ఈ బ్యాటింగ్ దిగ్గజం అనుభవం తప్పకుండా విండీస్ క్రికెట్ జట్టుకు ఉపయోగపడుతుందని సీడబ్ల్యూఐ భావిస్తున్నది.
భారత్ - వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరుగనుండగా ఈ టూర్ మొత్తానికి బ్రియాన్ లారా.. విండీస్ టీమ్ తోనే ఉండనున్నాడట. లారా మార్గనిర్దేశనంలో విండీస్ క్రికెట్ జట్టు ఏదైనా అద్భుతాలు చేస్తే అప్పుడు అతడు టీమ్ తో తన భాగస్వామ్యాన్ని కొనసాగించనున్నాడు.
West Indies legend Brian Lara has joined the players at their camp at CCG ahead of the series vs India. Lara is Performance Mentor.
— Windies Cricket (@windiescricket) July 3, 2023
The 1st Cycle Pure Agarbathi Test will be played at Windsor Park in Dominica. #WIHome #WIvIND
Get Tickets⬇️https://t.co/21A070Xq1G pic.twitter.com/NEaCL9exkS
బ్రియాన్ లారా రికార్డులు..
విండీస్ దిగ్గజాలలో ఒకడైన లారా.. ఆ జట్టు తరఫున 131 టెస్టులు, 299 వన్డేలు ఆడాడు. టెస్టులలో 52.88 సగటుతో 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టులలో లారా బెస్ట్ స్కోరు 400. ఈ రికార్డు అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక వన్డేలలో పదివేల మార్కు (10,405) దాటిన లారా.. 40.48 సగటుతో రాణించాడు. వన్డేలలో లారాకు 19 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలున్నాయి.
విండీస్ క్రికెట్ బాగుపడాలంటే..
వరల్డ్ కప్ కు అర్హత సాధించని వెస్టిండీస్ దారుణ పతనంపై మాజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టు బాగుపడాలంటే ఏం చేయాలనేదానిపై మాజీ క్రికెటర్ గార్నర్ గ్రీనిడ్జ్ మాట్లాడుతూ.. విండీస్ ఓడిపోవడం బాధగా ఉందని, కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నాడు. ఒకప్పుడు వెస్టిండీస్ ఓడిపోయిందంటే చాలా బాధపడేవాళ్లమని.. కానీ కరేబియన్ టీమ్ లో ప్రమాణాలు పడిపోయి ఓటములు నిత్యకృత్యమైన వేళ ఓటముల గురించి పట్టించుకోవడం లేదని చెప్పాడు. అయితే ప్రపంచకప్ కు అర్హత సాధించకపోవడం మాత్రం జీర్ణించుకోలేనిదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial