Virat Kohli: టెస్ట్ క్రికెట్టే నా ఆటకు పునాది, కల నెరవేర్చుకున్నా - కోహ్లీ భావోద్వేగం
Virat Kohli: వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి స్టార్ స్పోర్ట్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చిన కోహ్లీ.. తన కెరీర్‌లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) క్రికెట్(Cricket) ప్రపంచానికే కాదు అసలు ఎవరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఈ రన్ మెషీన్ గురించి చాలా చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తే. సచిన్‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చి క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన కింగ్ విరాట్ కోహ్లీ. పదిహేనేళ్ల కెరియర్‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 50 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌లో 80 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు. కోహ్లీ క్రికెట్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు తిన్నా ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. తొలిసారి తన క్రికెట్ ప్రయాణం గురించి విరాట్ కోహ్లీ స్పందించాడు. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి స్టార్ స్పోర్ట్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చిన కోహ్లీ.. తన కెరీర్‌లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
టెస్ట్ క్రికెట్ ఓ చరిత్ర
తన ఆటకు టెస్టు క్రికెటే పునాదని... ఇదొక చరిత్ర. ఒక సంస్కృతి. వారసత్వమని విరాట్ అన్నాడు. ప్రత్యర్థి జట్టుతో నాలుగు- ఐదు రోజుల పాటు పోటీపడటం అన్నింటికంటే భిన్న అనుభవాన్ని ఇస్తుంది. నాలుగైదు రోజులు మ్యాచ్ కోసం కష్టపడిన తరువాత ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్న కోహ్లీ... ఫలితం సంగతి పక్కన పెడితే టెస్టు ఆడే అనుభవం చాలా బాగుంటుందన్నాడు. జట్టు కోసం, వ్యక్తిగతమైనా సరే టెస్టు ఫార్మాట్‌లో రాణిస్తే ఆ సంతృప్తే వేరని కోహ్లీ అన్నాడు. తాను సంప్రదాయ క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడేవాడినని... అందుకే తనకు టెస్టులంటే అమితమైన ఇష్టమని... కింగ్ కోహ్లీ అన్నాడు. టీమిండియా తరఫున వంద కంటే ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవమన్నాడు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడే టెస్టు క్రికెటర్‌గా మారాలని కలలు కనేవాడినని... అది నెరవేరినందుకు ప్రతి ఒక్కరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.దక్షిణాఫ్రికా నుంచి ఆకస్మికంగా తిరిగి భారత్‌కు వచ్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ కారణంగా కోహ్లీ సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 26 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు నాటికి కోహ్లీ జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్ నుంచి వైదొలిగాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భారత ఆటగాళ్లు దక్షిణాఫ్రికా వెళ్లారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణా దక్షిణాఫ్రికాలో ఉన్నారు.