Virat Kohli Century: 1021 రోజులు! 84 ఇన్నింగ్సులు! మూడేళ్లు! కోహ్లీ.. నీ 71వ సెంచరీ మాకు ఐ ఫీస్ట్!
Virat Kohli Century: ఆహా..! ఎన్నాళ్లయ్యిందయ్యా ఇలాంటి అద్భుతం చూసి! ఔరా..! ఎన్ని రోజులైందయ్యా ఇలాంటి ఇన్నింగ్స్ కన్నులారా వీక్షించి! దేవుడా..! ఎన్నాళ్లు నీరీక్షించామయ్యా ఇలాంటి సెంచరీ కోసం!
Virat Kohli Century: ఆహా..! ఎన్నాళ్లయ్యిందయ్యా ఇలాంటి అద్భుతం చూసి! ఔరా..! ఎన్ని రోజులైందయ్యా ఇలాంటి ఇన్నింగ్స్ కన్నులారా వీక్షించి! దేవుడా..! ఎన్నాళ్లు నీరీక్షించామయ్యా ఇలాంటి సెంచరీ కోసం! అయ్యో..! ఎన్ని విమర్శలు సహించావయ్యా ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు!
1021 రోజులు..! 84 ఇన్నింగ్సులు..! మూడేళ్లు..!
అంతర్జాతీయ క్రికెట్లో కింగ్ విరాట్ కోహ్లీ 71వ సెంచరీ చేసేందుకు పట్టిన కాలమిది. క్రికెట్ మైదానంలో రెండో విరాట పర్వం మొదలయ్యేందుకు పట్టిన సమయమిది. క్రీజులో ఛేదన రారాజు నటరాజ నాట్యం ఆడేందుకు తీసుకున్న విరామమిది.
అప్పుడెప్పుడో ఈడెన్ గార్డెన్స్‌లో గులాబి బంతితో ఈడెన్ గార్డెన్స్‌లో నీ 70వ సెంచరీ వీక్షించాం. మళ్లీ ఇన్నాళ్లకు.. ఇన్నేళ్లకు ఆసియాకప్‌లో నీ 71వ శతకాన్ని ఆస్వాదించాం. ఈ రెండు ఈవెంట్ల మధ్య కాల చక్రం గిర్రున తిరిగింది. విరాట్ కోహ్లీ కెరీర్లోనూ ఎన్నో మార్పులొచ్చాయి. అడపా దడపా పరుగులు చేస్తున్నా తన ప్రమాణాలను అందుకోలేక పోయాడు. విపరీతమైన క్రికెట్‌తో ఫేక్ ఇంటెన్సిటీతో బాధపడ్డాడు. 2019 ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్‌లో ఓటమి చవిచూశాడు. తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు టీ20 కెప్టెన్సీ వదిలేశాడు. వన్డేలు, టెస్టుల్లో జట్టును నడిపించాలనుకున్నా అనూహ్యంగా నాయకత్వాన్నీ వదిలేశాడు. తనను స్టార్ చేసిన టీమ్‌ఇండియాకు విజయాలు అందించేందుకు విలువైన భాగస్వామ్యాలే అందిస్తున్నా సెంచరీ చేయడం లేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. నెల రోజులు బ్యాటే పట్టలేదు. అందుకే ఇన్నాళ్ల తర్వాత వచ్చిన ఈ శతకం ఎంతో మధురంగా ఉంది. కళ్లల్లో నీళ్లు తెప్పించింది. నీ కరవు కాదు మా కన్నుల కరవు తీరినట్టు అనిపిస్తోంది.
ఆసియాకప్‌లో కోహ్లీ చేసిన మొదటి హాఫ్ సెంచరీతో ఆశలు పెరిగాయి. నాలుగు మ్యాచులాడాక చేసిన పరుగులు చూసి అతి త్వరలోనే సెంచరీ చూస్తాం అనిపించింది. కానీ ఇలా..! అఫ్గాన్ మ్యాచులోనే వీక్షిస్తామని 18వ ఓవర్ వరకు అస్సలు అనుకోలేదు. అందుకే ఈ ఇన్నింగ్స్ అభిమానులకు ఎంతో స్వీట్! మరెంతో బ్యూటిఫుల్! రోహిత్ బదులు కింగ్ కోహ్లీ ఓపెనర్‌గా రావడమే స్పెషల్! మూడో ఓవర్ నుంచి అతడు కొట్టిన షాట్లలో ఎంతో ఈజ్‌నెస్ కనిపించింది. బౌలర్ల మైండ్‌ను చదివేస్తూ వేగంగా బంతులేసే అఫ్గాన్ స్పిన్నర్ల బంతుల్ని ముందుగానే పసిగడుతూ బౌండరీలు, సిక్సర్లు బాదేస్తుంటే సంతోషంగా అనిపించింది. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుంటే భారీ స్కోరు చేస్తాడనిపించింది.
హాఫ్ సెంచరీ తర్వాత మొదలెట్టిన విధ్వంసంతో అందరికీ అర్థమైంది! ఇది కింగ్ కోహ్లీ రోజని! తను ఊహించని ఫార్మాట్లో సెంచరీ చేస్తాడని! ఛేదన రారాజు డిస్ట్రక్టివ్ బ్యాటింగ్‌ను ఎంత వర్ణించినా తక్కువే! సాధారణంగా 15 ఓవర్ వరకు అతడి స్ట్రైక్‌రేట్ 150 లోపే ఉంటుంది. ఆఖరి ఐదు ఓవర్లలో 180-220 వరకు వెళ్లిపోతుంది. మూడేళ్లుగా ఇలాంటి స్ట్రైక్‌రేట్ కోసం ఫ్యాన్స్, విశ్లేషకులు ఎదురు చూస్తేనే ఉన్నారు. కానీ ఇన్నాళ్లకు ఈ మ్యాచులో అలాంటి స్ట్రైక్‌రేట్ కనిపించింది. ఎందుకంటే హాఫ్ సెంచరీకి 32 బంతులు తీసుకుంటే జస్ట్ 17 బాల్సే తీసుకున్నాడు. ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది అతడెంత భీకరంగా ఆడాడో! అఫ్గాన్ ఆటగాళ్లను ఎంత భయపెట్టాడో! శతకోటి భారతీయులను ఎంత మురిపించాడో! పైగా ఎప్పుడూ ఆడని స్వీప్ షాట్లూ ఆడేశాడండోయ్!
ఎలాగూ ఆసియాకప్ పోయింది! కానీ అంతకన్నా విలువైన విరాట్ కోహ్లీ సెంచరీ దొరికింది. దాన్ని మించిన వింటేజ్ ఫామ్ వచ్చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ ఇలాంటి ఫామే కొనసాగించాలి. ఈ మ్యాచ్ ద్వారా టీమ్‌ఇండియా ఓ మెసేజ్ సెండ్ చేసినట్టైంది. బౌన్సీ, స్వింగ్, పేస్ పిచ్‌లు ఉండే ఆస్ట్రేలియాలో, ప్రపంచకప్‌లో అవసరమైతే కింగ్ కోహ్లీ ఓపెనింగ్‌కు వస్తాడన్నదే ఆ సందేశం. అంటే రోహిత్, రాహుల్‌లో ఎవరు ఫామ్‌లో లేకున్నా అందులో ఒకరి బదులు టాప్ ఆర్డర్లో వచ్చేస్తాడు. ఏం చేసినా, ఏ ప్లేసులో ఆడినా టీమ్‌కు కావాల్సింది పరుగులు. అవి చేస్తావని, ఇలాంటి సెంచరీలు ఇంకెన్నో అందుకోవాలని, ప్రపంచకప్‌ను ముద్దాడాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటున్నాడు.