Asia Cup 2025 Ind Vs Pak Controversy Latest Updates: క్రీడల్లోకి రాజకీయాలను తేవొద్దు.. ఆసియాకప్ లో అలా జరగడం దురదృష్టకరం.. మాజీ క్రికెటర్ ఆవేదన
క్రికెట్ జెంటిల్మన్ గేమ్ అని పేరు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటలను ఆ పేరుకు నష్టం కలిగించేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆసియాకప్ ఘటనలు ఉదహరిస్తున్నారు.

Asia Cup 2025 Mohsin Naqvi Vs Team India Latest Updates: తాజాగా ముగిసిన ఆసియకప్ ఎన్నడూ లేని విధంగా వివాదస్పదంగా జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, ఇండియా, పాకిస్తాన్ ప్లేయర్ల ప్రవర్తనతో ఈ సారి ట్రోఫీ హాట్ హాట్ గా నడిచింది. పెహల్గాం దాడికి నిరసనగా భారత క్రికెటర్లు.. పాక్ క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేసేందుకు నిరాకరించారు. రెండు లీగ్ మ్యాచ్ లతోపాటు, ఫైనల్ ముగిశాక కూడా వారు ఈ విధంగానే ప్రవర్తించారు. అలాగే పాక్ క్రికెటర్లు కూడా మైదానంలో లేకిగా ప్రవర్తించారు. బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ తుపాకితో కాల్చుతున్నట్లుగా సంబరాలు చేసుకోగా, బౌలర్ హరీస్ రవూఫ్ ఫైటర్ జెట్లు నేలకూలినట్లుగా గెశ్చర్ వేసి, ఐసీసీతో మొట్టికాయలు వేసుకున్నారు. ఈక్రమంలో టోర్నీలో దాయాదుల మధ్య జరిగిన మూడు మ్యాచ్ లు హాట్ గా నడిచాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై 5 వికెట్లతో భారత్ ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి కప్పును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవరాల్ గా ఈ టోర్నీలో మూడుసార్లు పాక్ ను ఇండియా చిత్తు చేసింది. తాజాగా ఇండియా, పాక్ ఆటగాళ్ల తీరుపై 1983 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ జట్టులో సభ్యుడు, మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ వ్యాఖ్యానించాడు.
#WATCH | Bengaluru, Karnataka | Former Indian cricketer Syed Kirmani says, "The way cricket is being played all around..., there has been no gentleman-ness in the game. There have been very rude, arrogant gestures on the field... I'm getting messages from all over... The Indian… pic.twitter.com/YkM9P1CMGo
— ANI (@ANI) September 30, 2025
రాజకీయాలొద్దు..
క్రీడల్లో రాజకీయాలు చేయకూడదని కిర్మాణీ ఘాటుగా విమర్శించాడు. తాము ఆడిన కాలంలో ఆటను, రాజకీయాలను వేర్వేరుగా చూసేవాళ్లమని, ఇండియా నుంచి పాక్ కు, పాక్ నుంచి ఇండియాకు ఆటగాళ్లు వచ్చి మ్యాచ్ లు ఆడేవారని, అయితే ప్రస్తుత తరుణంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆసియాకప్ లో ఇరుదేశాల క్రికెటర్లు .. రాజకీయాలను ఆటల్లోకి తీసుకొచ్చారని ఆక్షేపించాడు.
ఈతరం క్రికెటర్లకు ఏమైంది..
ఆసియాకప్ లో ఆటగాళ్ల ప్రవర్తన చూసి చాలా సిగ్గుగా అనిపించిందని, ఈతరం ఆటగాళ్లకు ఏమైందని కిర్మాణి వ్యాఖ్యానించాడు. ఆసియాకప్ లో జరిగినది విచారకరమైందని, ఈ విషయంపై స్పందించాలని తనకు ఎన్నో మెసేజీలు వచ్చాయని పేర్కొన్నాడు. క్రికెట్ జెంటిల్మన్ గేమ్ అని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈసారి ఆసియాకప్ నిర్వహణ వివాదాలకు గురైన సంగతి తెలిసిందే. పాక్ హోం మంత్రి, పీసీబీ ఛీప్, ఏసీసీ అధ్యక్షుడు అయిన మోహ్సిన్ నఖ్వి నుంచి కప్పును స్వీకరించబోమని, టీమిండియా తేల్చి చెప్పడంతో నఖ్వి ఆ కప్పును తన వెంట తీసుకెళ్లడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. తాజాగా జరిగిన ఘటనలు క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరుస్తున్నాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.




















