Surya Kumar Yadav: సూర్య నీ జోరు ఇప్పట్లో ఆపకు.. ఇలానే సాగిపో..!
సూర్యకుమార్ యాదవ్... ప్రపంచ క్రికెట్ మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న స్టైలిష్ బ్యాటర్. ఏమా షాట్లు, ఏమా ఇన్నోవేషన్. తర్వాతి 360 డిగ్రీల బ్యాటర్ కచ్చితంగా సూర్యకుమార్ యాదవ్. ఇందులో సందేహమే లేదు.
మన ఇండియన్ క్రికెట్ లో కొద్దిమంది క్రికెటర్లు ఉంటారు... అన్నీ ఫార్మాట్లలోనూ రాణిస్తూ ఉంటారు. కానీ కొద్దిమంది పేర్లు చెప్తే.... ఓ ఫార్మాట్ కు వాళ్లే రారాజులు అనిపిస్తారు. భారత క్రికెట్ సంగతి తీసుకుంటే... టెస్టులు అంటే రాహుల్ ద్రవిడ్, వన్డేలు అంటే విరాట్ కోహ్లీ గుర్తొస్తారు. అలా అని వీళ్లు మిగతా ఫార్మాట్లు ఆడరు, మిగతా ప్లేయర్స్ ఈ ఫార్మాట్లు ఆడలేరు అని కాదు. ఈ ఫార్మాట్లలో వీళ్లు అంతలా ఇంపాక్ట్ చూపించారు. ఆ విధంగా... టీ20ల మాట వస్తే కచ్చితంగా ఆ ప్లేస్ సూర్యకుమార్ యాదవ్ కు ఇచ్చేయాల్సిందే. దీనిపై డిబేట్ ఉంటుందని అనుకోవట్లేదు.
జట్టులోకి వచ్చిన ఏడాదిన్నరలోనే సూర్య చూపిన ఇంపాక్ట్ అలాంటిది. 14 మార్చి 2021... టీ20ల్లో, అంతెందుకు అంతర్జాతీయ క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్. తను ఆడిన తొలి బాలే చెప్పింది... ఇంటర్నేషనల్ క్రికెట్ లో తన ఆట ఎలా ఉండబోతోందో అని. ఫాస్టెస్ట్ బౌలర్స్ లో ఒకడైన జోఫ్రా ఆర్చర్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్ ను తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఫైన్ లెగ్ మీదగా పికప్ షాట్ ఆడాడు. ప్రపంచమంతా ఆ షాట్ కు స్టన్ అయిపోయింది. అప్పట్నుంచి స్టన్ అవడం క్రికెట్ ప్రపంచానికి అలవాటు అయిపోయింది. మ్యాచ్ మ్యాచ్ కు, సిరీస్ సిరీస్ కు.... స్టన్ అవడానికి కొత్త రీజన్స్ ను సూర్య ఇస్తున్నాడు కాబట్టి. సూర్య రాక ముందు మన మిడిలార్డర్ చాలా ఇన్ కన్సిస్టెంట్ గా ఉండేది. ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియని పరిస్థితి. కానీ సూర్య వచ్చిన దగ్గర్నుంచి టీం డగౌట్, స్టేడియంలో కూర్చున్న ఫ్యాన్స్, టీవీల ముందు చూస్తున్నవారు.... ఇలా అందరికీ నేనున్నాను అంటూ ఓ ధీమా కల్పించాడు... ఈ స్టైలిష్,
ఇన్నోవేటివ్ బ్యాటర్. మనకు మిడిల్ ఓవర్స్ లో రన్ రేట్ తగ్గిపోతుందనే విమర్శ ఉండేది. సూర్య వచ్చిన దగ్గర నుంచి టీ20ల్లో 7 నుంచి 15 ఓవర్ల మధ్య రన్ స్కోరింగ్ చాలా బాగా పెరిగింది. ఎందుకంటే క్రీజులోకి వచ్చింది మొదలు... ఎలాంటి బెరుకు లేకుండానే... చూస్తుండగానే వేగంగా 20, 30 పరుగులు చేసేస్తాడు. ఇక అక్కడ్నుంచి వెనుదిరిగి చూసుకోడు. సూర్య ఆటతీరు వల్ల టీం.... రన్స్ పరంగా లాభపడటమే కాక... అవతలి ఎండ్ లో ఉన్న బ్యాటర్ మీద కూడా ప్రెషర్ లేకుండా చేయగలడు. ఓ మిడిలార్డర్ బ్యాటర్ నుంచి ఆశించేదాని కన్నా చాలా ఎక్కువ ఇస్తున్నాడు... సూర్యకుమార్. సూర్య బ్యాటింగ్ గురించి తనికెళ్ల భరణి అయితే కచ్చితంగా ఇలానే చెప్తారు.
సూర్య బ్యాటింగ్ అంటే అంతే మరి. అసలు కొట్టినట్టు కూడా తెలియదు. ఇక బౌలర్స్ పరిస్థితి అయితే... సూర్య ఎప్పుడు క్రీజులోకి వచ్చాడో.... ఎప్పుడు రన్స్ బాదేశాడో కూడా వాళ్లు అర్థం చేసుకునే గ్యాప్ ఉండదు. వేరే లెవల్ లో బ్యాటింగ్ చేయడం వల్లే.... ఏడాదిన్నరలోనే ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సాధించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్... సూర్యకుమారే.
ఈ ఏడాది ఇప్పటిదాకా అంతర్జాతీయ టీ20ల్లో 1026 పరుగులు చేశాడు. అది కూడా కేవలం 28 మ్యాచెస్ లోనే. ఇంతకముందు పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రమే... ఓ ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించాడు. ఇప్పుడు సూర్య కూడా ఆ లిస్ట్ లో చేరాడు. కానీ రిజ్వాన్ కన్నా సూర్య రికార్డ్ 2 రకాలుగా స్పెషల్ అని చెప్పుకోవాలి. రిజ్వాన్ ఓపెనర్. సూర్యకుమార్ నంబర్ 4 లో వస్తాడు. ఇకపోతే స్ట్రైక్ రేట్. ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్ స్ట్రైక్ రేట్.... 186.54. మనం సాధారణంగా వింటుంటాం కదా... మంచినీళ్ల ప్రాయంగా రన్స్ కొట్టేశాడు అని. దీనికి మన కళ్ల ముందు కనిపిస్తున్న మోడర్న్ డే ఉదాహరణ... సూర్యకుమార్ యాదవ్.
సో ప్రస్తుతం సూర్య ఉన్న ఫాంకు, అతను ఆడుతున్న ఇన్నింగ్స్ కు చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా విసుగు రాదు... ఎన్ని పేజీలు అవుతాయో కూడా తెలియదు. కాబట్టి... సూర్య అమేజింగ్ టాలెంట్ గురించి చివర్లో రెండు ముక్కలు చెప్పి ముగించేద్దాం. జింబాబ్వేతో మ్యాచ్ తర్వాత సూర్య ఓ మాట అన్నాడు. ప్రపంచంలో ఒకే ఒక్క 360 డిగ్రీ ప్లేయర్ ఉన్నాడు.... అతనిలా ఆడటానికి ప్రయత్నిస్తా అని అన్నాడు. అదే ఏబీ డివిలియర్స్ గురించి అన్నమాట. దీని గురించి ఏబీడీ కూడా స్పందించాడు. నువ్వు ఆ స్థాయికి చాలా తొందరగా చేరుకుంటున్నావ్ సూర్యా.... ఇంకా చెప్పాలంటే ఆ స్థాయిని దాటేయబోతున్నావ్ అని డివిలియర్స్ ట్వీట్ చేశాడు. ఇది నూటికి నూరు శాతం నిజం. సూర్యకుమార్ వయసు ఇప్పుడు 32. ఇంకొక 3-4 ఏళ్లు ఇదే రీతిలో ఆడితే.... టీ20 రికార్డులన్నీ సూర్య ఖాతాలో ఉంటాయి. ఆల్ టైం గ్రేట్ టీ20 ప్లేయర్స్ ప్రస్తావన వస్తే కచ్చితంగా వచ్చే మొదటి పేరు కూడా సూర్యదే ఉంటుంది.