Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Adelaide Test: జట్టు ప్రయోజనాల కోసం తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్న రోహిత్ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి.
Aus Vs Ind Test: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సాహాసోపేత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఓపెనింగ్ లో ఆడే రోహిత్, రెండో టెస్టు నుంచి మిడిలార్డర్ లో ఆడుతున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్- రాహుల్ జోడీ ఓపెనింగ్ లో అదరగొట్టడంతో ఆ జంటను విడదీయడం ఇష్టం లేక అడిలైడ్ టెస్టులో ఆరో నెంబర్లో బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోహిత్ తీసుకున్న ఈ వైఖరిపై దిగ్గజ మాజీ ప్లేయర్లు సునీల్ గావస్కర్, రికీ పాంటింగ్ వాదన చెరో రకంగా ఉంది.
రోహిత్ నిర్ణయం సమంజసమే..
మిడిలార్డర్ లో నెం.6లో ఆడాలనే రోహిత్ నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ గావస్కర్ సమర్థించాడు. తొలి టెస్టులో 200కుపైగా పరుగులు జోడించిన జైస్వాల్-రాహుల్ జోడీని మార్చాల్సిన అవసరం లేదని, జట్టు కోసం మిడిలార్డర్ లో ఆడాలనే త్యాగాన్ని రోహిత్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. పైగా దాదాపు ఒక నెల నుంచి రోహిత్ కు అస్సలు మ్యాచ్ ప్రాక్టీస్ లేదని, ఈ నేపథ్యంలో రెండో టెస్టులో పింక్ బాల్ ను ఎదుర్కోవడం సమంజసం కాదని పేర్కొన్నాడు. మిడిలార్డర్ లో ఆడటం వల్ల రోహిత్ కు పరిస్థితులను బట్టి మెలిగే అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా జట్టు కోసం నిస్వార్థంగా రోహిత్ ఆలోచించాడని కితాబిచ్చాడు.
ప్రమాదంలో కెరీర్..
స్వతహాగా ఓపెనర్ అయిన రోహిత్ శర్మ.. మిడిలార్డర్లో ఆడటం కరెక్టు కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. నిజానికి రాహుల్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్ కాదని, తన కోసం రోహిత్ తన స్థానాన్ని వదులు కోవడం కరెక్టు కాదని తెలిపాడు. తొలి ఐదు స్థానాల్లో బ్యాటర్లు కుదురుకున్న క్రమంలో రోహిత్ కు నెం.6 లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కుతుందని, రోహిత్ లాంటి దూకుడైన ప్లేయర్ ఆ స్థానంలో ఆడటం కరెక్టు కాదని పేర్కొన్నాడు. ప్రస్తుత నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే రోహిత్ మిగతా కెరీర్ ఆసాంతం నెం.6లోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. మరోవైపు ఆసీస్ లో రోహిత్ కు అంత మంచి రికార్డు లేకపోయినప్పటికీ, హిట్ మ్యాన్ స్థాయి వేరని అభిప్రాయ పడ్డాడు.
రోహిత్ శర్మకు కొడుకు పుట్టడంతో పెర్త్ లో జరిగిన తొలి టెస్టుకు అతను దూరమయ్యాడు. రెండో టెస్టుకు అతను సిద్ధంగా ఉన్నప్పటికీ, సమీకరణాల రిత్యా అతను ఆరో నెంబర్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. మరోవైపు అడిలైడ్ టెస్టులో ఆసీస్ దాదాపుగా పట్టు బిగించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం మూడోరోజే ఫలితం తేలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ టెస్టులో బ్యాటర్ల వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే రోహిత్ సేన ఆలౌటైంది. తన తొలి ఇన్నింగ్స్ లో కంగారూలు 337 పరుగులు చేసి, 157 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ రెండోరోజు శనివారం ఆటముగిసే సరికి 128/5తో నిలిచింది. ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
Also Read: Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు