Asia Cup 2025 SL vs HKG Result Update: వరుస విజయాల జోష్ లో లంక.. సూపర్-4కి మరింత చేరువలో.. హాంకాంగ్ పై చెమటోడ్చి విజయం.. రాణించిన నిసాంక, చమీర,
లంక కూడా వరుస విజయాలతో దూసుకెళుతోంది. దీంతో దాదాపు సూపర్-4 బెర్త్ ను ఖరారు చేసుకున్నట్లే. తాజా మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించి, హాంకాంగ్ ను చిత్తు చేసింది. నిసాంక కీ రోల్ పోషించాడు.

Asia Cup 2025 SL Registered 2nd Victory: ఆసియాకప్ లో గత ఎడిషన్ రన్నరప్ శ్రీలంక జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని సాధించి, టోర్నీలో సూపర్-4కి మరింత చేరువైంది. సోమవారం దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో హాంకాంగ్ పై 4 వికెట్లతో కాస్త చెమటోడ్చి విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ నిజఖత్ ఖాన్ సూపర్బ్ ఫిఫ్టీ (38 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
బౌలర్లలో దుష్మంత చమీరకు రెండు వికెట్లు దక్కాయి. ఛేజింగ్ ను లంక.. 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసి, పూర్తి చేసింది. ఓపెనర్ పతుమ్ నిసాంక అద్భుత అర్ధ సెంచరీ (44 బంతుల్లో 68, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో సత్తాచాటి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో యాసిమ్ ముర్తుజా కు రెండు వికెట్లు దక్కాయి. ఈ ఫలితంతో మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిన హాంకాంగ్ టోర్నీ నుంచి ఔట్ అయింది. గ్రూప్-బిలో సూపర్-4కి చేరేందుకు లంక, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లకు చాన్స్ ఉంది.
Sri Lanka seal the win by 4 wickets💥
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 15, 2025
A classy knock of 68 runs from Pathum Nissanka steers the Lions past Hong Kong. 🏏🦁#SriLankaCricket #AsiaCup2025 #SLvHK pic.twitter.com/XKUQaH6isC
సూపర్బ్ బ్యాటింగ్..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ మంచి బ్యాటింగ్ పనితీరును ప్రదర్శించింది. ముఖ్యంగా ఓపెనర్లు జీషాన్ అలీ (23), అన్షీ రాఠ్ (48) చక్కని పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 41 పరుగులు జోడించారు. ఆ తర్వాత నిజఖత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, 36 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. అన్షీ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు వేగంగానే కదిలింది. అయితే కీలక దశలో లంక బౌలర్లు వికెట్లు తీయడంతో హాంకాంగ్ భారీ స్కోరు చేయలేక పోయింది.
తడబడిన లంక..
పసికూన హాంకాంగ్ పై ఓ మాదిరి ఛేజ్ చేయడానికి లంక తడబడింది. ఆరు వికెట్లను కోల్పోయి, టార్గెట్ ను ఛేదించింది. ఆరంభంలోనే కుశాల్ మెండిస్ (11), కమిల్ మిషారా (19) ఔటైనా, కుశాల్ పెరీరా (20)తో చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. గ్రౌండ్ కు నలువైపులా బౌండరీలు బాదుతూ, వేగంగా పరుగులు సాధించాడు. ఈక్రమంలో 35 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుని, ఔటయ్యాడు. ఈ దశలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా, దసున్ షణక (6 నాటౌట్), వనిందు హసరంగా (20 నాటౌట్) కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ వేగంగా ఆడి ఏడో వికెట్ కు కీలకమైన 26 పరుగులు జోడించి, జట్టును ఒడ్డున పడేశారు. నిసాంకకు ప్లేయర్ ఆఫ్ దమ్యాచ్ అవార్డు దక్కింది. మంగళవారం ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ గెలిచినట్లయితే లంకతోపాటు ఆఫ్గాన్ జట్టు కూడా సూపర్-4కి చేరుకుంటుంది. ఒకవేళ బంగ్లా గెలిస్తే, లంక-ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ ఫలితం తేలే వరకు ఆగాల్సి ఉంటుంది.




















