SA Vs NED: అంచనాలను మించిన నెదర్లాండ్స్ స్కోరు, దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే!
Odi World Cup 2023: నెదర్లాండ్స్ అంచనాలకు మించి రాణించింది. వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అంచనాలకు మించి రాణించింది. వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ప్రారంభం నుంచి నెదర్లాండ్స్‌ను కట్టడి చేసిన సఫారీ బౌలర్లు చివర్లో ధారళంగా పరుగులు ఇచ్చారు. దీంతో 200 పరుగుల మార్క్ అయినా దాటుందన్న అన్న దశ నుంచి కోలుకొని నెదర్లాండ్స్ 245 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్ సారధి స్కాట్ ఎడ్వర్డ్స్ ఒంటరి పోరాటంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివరి వరకూ అజేయంగా ఉన్న ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 78 పరుగులు చేశాడు. చివర్లో ఆర్యన్ దత్త్ మెరుపులు మెరిపించాడు. కేవలం తొమ్మిది బంతుల్లోనే మూడు సిక్సర్లు బాదిన ఆర్యన్.... 23 పరుగలు చేసి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని ఇచ్చాడు.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అరంభంలో ప్రొటీస్ బౌలర్లు సమష్టిగా రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెంచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి వరకూ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు చేశాడు. ఎడ్వర్డ్స్ తప్ప మరే నెదర్లాండ్స్ బ్యాటర్ కనీసం 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. ఎడ్వర్డ్స్ తర్వాత ఎక్కువ పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో నెదర్లాండ్స్‌కు దక్కాయి. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ బౌలర్లు 32 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో ఇచ్చారు.
నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆరంభం నుంచి ఒడుదొడుకులకు లోనైంది. భారత సంతతి ఆటగాడు విక్రమ్‌జిత్‌ను అవుట్ చేసి రబాడ నెదర్లాండ్స్ బ్యాటింగ్ పతనాన్ని మొదలుపెట్టాడు. 22 పరుగుల స్కోరు వద్ద 2 పరుగులు చేసిన విక్రమ్‌జిత్.. రబాడ బౌలింగ్‌లో క్లాసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం మరో రెండు పరుగులు స్కోరు బోర్డు మీదకు చేరాయో లేదో 18 పరుగులు చేసిన మాక్స్ ఓడౌడ్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో నెదర్లాండ్స్ 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపు ప్రొటీస్ బౌలర్లను నెదర్లాండ్స్ బ్యాటర్లు సమర్థంగానే ఎదుర్కొన్నారు.
ఇన్నింగ్స్ కుదటపడుతున్న సమయంలో 40 పరుగుల వద్ద కోలిన్ అకెర్‌మాన్‌ను కాట్జే అవుట్ చేయగా... బాస్ డి లీడేను రబాడ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం భారత సంతతి ఆటగాడు తేజా నిడమనూరు, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ఆచితూచి ఆడుతూ నెదర్లాండ్స్ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు. బలపడుతున్న వీరిద్దరి జోడిని ఎంగిడి విడదీశాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద ఎంగెల్‌బ్రెచ్డ్ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. 20 పరుగులు చేసిన తేజ నిడమనూరు కూడా అవుటయ్యాడు. కానీ సారధి ఎడ్వర్డ్స్ మాత్రం పోరాటం ఆపలేదు. ఎడ్వర్డ్స్‌కు మంచి సహకారం అందించిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే 29 పరుగులు చేశాడు. అసలు నిర్ణీత ఓవర్లు నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న అన్న స్థితి నుంచి ఎడ్వర్డ్స్, మెర్వే జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్యన్ దత్త్ నెదర్లాండ్స్‌కు పోరాడే స్కోరు అందించాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో అందరూ సమష్టిగా రాణించారు. ఎంగిడి రెండు, జాన్సన్ 2, రబాడ 2 వికెట్లు తీశారు. కాట్జే, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం
వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికా ఈ లక్ష్యాన్ని సునాయసంగానే ఛేదిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు. అయితే నెదర్లాండ్స్‌ను తక్కువ అంచనా వేయలేమని.. బ్యాటింగ్‌లో అద్భుతం చేసిన నెదర్లాండ్స్ బౌలింగ్‌లోనూ అద్భుతం చేస్తే ప్రొటీస్‌కు షాక్ తప్పదని అభిమానులు భావిస్తున్నారు.