Shubman Gill Yo Yo Test: కోహ్లీ, హార్ధిక్ కాదు - టీమిండియాలో కొత్త ఫిట్‌నెస్ ఫ్రీక్ - యో యో టెస్టులో రికార్డు స్కోరు
టీమిండియాలోకి కొత్త ఫిట్‌నెస్ ఫ్రీక్ వచ్చాడు. ఫిట్‌నెస్ విషయంలో ముందు వరుసలో ఉండే విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలను అధిగమించాడు.
Shubman Gill Yo Yo Test: భారత క్రికెట్ జట్టుతో కొంతకాలంగా ప్రయాణం చేస్తున్న ఈ ఏడాది వన్డేలలో ఓపెనర్‌గా ప్రమోషన్ పొంది జట్టులో తనదైన ముద్ర వేసుకున్న యువ సంచలనం శుభ్‌మన్ గిల్ మరో కొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియాలో ఫిట్‌నెస్ అంటేనే గుర్తుకువచ్చే విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలను తలదన్ని ప్రస్తుత జట్టులో అందరికంటే ఫిట్‌గా ఉన్న క్రికెటర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆసియా కప్ నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే అలూరు (కర్నాటక)లో నిర్వహించిన యో యో టెస్టులో గిల్.. ఏకంగా 18.7 స్కోరు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
టీమిండియాలో ఆరేండ్ల క్రితం ఈ యో యో టెస్టును తీసుకురాగా ఇప్పటివరకూ ఈ పరీక్షలో అత్యుత్తమంగా రాణించినవారంటే కచ్చితంగా కోహ్లీ, పాండ్యాలు ముందువరుసలో ఉంటారు. దేహదారుఢ్యం విషయంలో ఈ ఇద్దరూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అయితే బీసీసీఐ తాజాగా నిర్వహించిన యో యో టెస్టులో కోహ్లీ.. 17.2 స్కోరు సాధించాడు. గిల్.. కోహ్లీని దాటడం విశేషం. యో యో టెస్టు పాస్ అవ్వాలంటే మినిమం 16.5 పాయింట్స్ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఆసియా జట్టుకు ఎంపికైన వారిలో (ఐర్లాండ్ పర్యటనలో ఉన్న బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, సంజూ శాంసన్, తిలక్ వర్మతో పాటు కెఎల్ రాహుల్ ఈ టెస్టులో పాల్గొనలేదు) అందరూ 16.5 నుంచి 18 మధ్యలో స్కోరు చేశారని పీటీఐ వెల్లడించింది. అందరికంటే ఎక్కువగా గిల్ (18.7) స్కోరు చేశాడు.
Shubman Gill has the highest score on the Yo-Yo test. [PTI]
— Johns. (@CricCrazyJohns) August 25, 2023
- 18.7 by Gill....!!!! pic.twitter.com/HpIzqLRWGx
ఈ ఏడాది జనవరి - ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో గిల్.. రోహిత్‌తో ఓపెనర్‌గా వచ్చి సెంచరీల మీద సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కూడా సెంచరీ బాదాడు. ఇక ఐపీఎల్‌లో అయితే గిల్ విశ్వరూపమే చూపించాడు. మూడు సెంచరీలతో 800కు పైగా పరుగులు సాధించాడు. కానీ స్వదేశంలో ఆడినంత దూకుడును అతడు విదేశాల్లో చూపించలేకపోయాడు. ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్లలోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆసియా కప్, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్‌లలో రాణించి తిరిగి గాడినపడాలని గిల్ భావిస్తున్నాడు. ఫిట్‌నెస్ విషయంలో కూడా అందరికంటే ఎక్కువ స్కోరు చేయడం గిల్ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేదే.
Captain Rohit Sharma and Hardik Pandya have successfully cleared the Yo-Yo test. (PTI). pic.twitter.com/2iJoICCmMT
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 24, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial