Ind Vs Eng 4th Test Latest Updates : ప్లేయింగ్ లెవన్ పై గిల్ స్పష్టత.. అన్షుల్ అరంగేట్రం ఖాయమే..! కరుణ్ కు మరో ఛాన్స్.. పంత్ పై కీలక వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డు వేదికగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లు గెలిచి 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

Ind Vs Eng Anderson- Tendulkar Trophy Test Series Latest Updates: ఇంగ్లాండ్ తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు సంబంధించి టీమిండియా ప్లేయింగ్ లెవన్ పై భిన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పలువురు గాయం కారణంగా దూరం కావడం, మిగతా వారు ఫిట్ నెస్ సమస్యలను ఎదుర్కొంటుండటంతో ప్లేయింగ్ లెవన్ ఎలా ఉండబోతోందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే తెలుగు తేజం నితీశ్ రెడ్డి గాయపడి, అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని మిగతా రెండుమ్యాచ్ లకు దూరమయ్యాడు. అలాగే చేతి వేలి గాయంతో అర్షదీప్ సింగ్ కూడా నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా ఆటగాళ్లలో ఎవరెవరు ఆడతారో అనే దానిపై భారత టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ తాజాగా వ్యాఖ్యానించాడు. దాదాపుగా ప్లేయింగ్ లెవన్ పై ఒక అంచనాకు వచ్చే విధంగా అతని మాటలు ఉన్నాయి.
ఆకాశ్ దీప్ ఔట్..
రెండో టెస్టులో పది వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన పేసర్ ఆకాశ్ దీప్ నాలుగో టెస్టులో ఆడబోవడం లేదని గిల్ వ్యాఖ్యానించాడు. తొడ కండరాలనొప్పితోపాటు కాస్త వెన్ను గాయంతో అతను ఈ మ్యాచ్ కు దూరమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండటం లేదని గిల్ పేర్కొన్నాడు. మరోవైపు జట్టులోకి కొత్తగా వచ్చిన 24 ఏళ్ల పేసర్ అన్షుల్ కాంబోజ్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రానికి అతి చేరువలో ఉన్నాడని పేర్కొన్నాడు. తను దేశవాళీల్లో గొప్పగా రాణించడంతోపాటు ఇటీవల భారత్ ఏ తరపున ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. లోయర్ ఆర్డర్ లో పరుగులు చేయగల సత్తా కూడా ఉండటం అతనికి ప్లస్ పాయింట్ గా మారింది. ఈ క్రమంలో నాలుగో టెస్టులో అతని అరంగేట్రం ఖాయమని తెలుస్తోంది.
నర్మగర్భంగా..
అయితే సూటిగా అన్షుల్ విషయాన్ని చెప్పకుండా, ప్రసిధ్ కృష్ణతోపాటు అన్షుల్ ని కూడా ప్రయత్నిస్తామని గిల్ చెప్పాడు. తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన కారణంగా ప్రసిధ్ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. అతనికి బదులుగా అన్షుల్ ని ఆడిస్తేనే బాగుంటుందని అటు విశ్లేషకులు, ఇటు ప్రేక్షకులు ముక్తకంఠంతో అంటున్నారు. ఇక నాలుగో టెస్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ఆడతాడని గిల్ స్పష్టం చేశాడు. మూడో టెస్టులో గాయపడిన పంత్.. కాసేపు మాత్రమే కీపింగ్ చేసి, రెండు ఇన్నింగ్స్ ల్లోనూ బ్యాటింగ్ చేశాడు. ఈసారి మాత్రం పూర్తి స్థాయి వికెట్ కీపర్ గా తను బాధ్యతలు నిర్వర్తిస్తాడని పేర్కొన్నాడు. మరోవైపు ఈ పర్యటనలో అంతగా ఆకట్టుకోలేని కరుణ్ నాయర్ ను సమర్థించాడు. ఒక మంచి ఇన్నింగ్స్ తో అతను గాడిన పడతాడని, ఇప్పటివరకు అంత చెడ్డగా ఏమీ ఆడలేదని పేర్కొన్నాడు. దీంతో నాలుగో టెస్టులో కరున్ నాయర్ ఆడటం ఖాయంగా మారింది. దీంతో సాయి సుదర్శన్ తోపాటు రిజర్వ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ బెంచ్ కే పరిమితం కానున్నారు. మూడో టెస్టులో బౌల రూపంలో 25 పరుగులను జురెల్ సమర్పించడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్ లో కేవలం 22 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది.




















