అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!
Shreyas Iyer: మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు షాక్ తప్పేట్లు లేదు. ఆ జట్టు సారథి శ్రేయాస్ అయ్యర్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.
Shreyas Iyer Injury: ఐపీఎల్ లో రెండుసార్లు ట్రోఫీ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులు ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నారో అదే జరిగేలా ఉంది. కేకేఆర్ సారథి శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ లో అందుబాటులో ఉండే అవకాశాలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. వెన్ను నొప్పితో బాధపడుతున్న అయ్యర్ ఐపీఎల్ సీజన్ తో పాటు జూన్ లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌నకు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తున్నది. కీలక టోర్నీల ముందు ఇది కేకేఆర్‌తో పాటు టీమిండియాకూ భారీ కుదుపే..
సర్జరీ పక్కా..
ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు గాయంతో విరామం తీసుకున్న శ్రేయాస్.. తాజాగా ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ లో ముగిసిన నాలుగో టెస్టులో ఆడుతూ వెన్నునొప్పి తిరగబెట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. అయ్యర్ కు విశ్రాంతి తప్పదని వార్తలు వస్తున్నా తాజాగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వచ్చిన కథనం మేరకు అతడికి సర్జరీ తప్పనిసరి అని తేలింది.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి టీవోఐతో మాట్లాడుతూ.. ‘అయ్యర్ వెన్నునొప్పికి సర్జరీ తప్పదని వైద్యులు సూచించారు. అతడు లండన్ లో ఓ ప్రముఖ వైద్యుడి పర్యవేక్షణలో ఉన్నాడు. అతడికి కుదిరితే లండన్ లో లేదా ఇండియాలో సర్జరీ జరిగే అవకాశాలున్నాయి..’అని తెలిపాడు.
నాలుగు నెలలు డౌటే..
అయ్యర్ ఆపరేషన్ కు వెళ్తే మాత్రం అది భారత్ కు మరో దెబ్బే. సర్జరీ అయితే అయ్యర్ మూడు నుంచి నాలుగు నెలల పాటు టీమ్ కు దూరంగా ఉండాల్సిందే. ఇప్పటికే టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలు సర్జరీలతో ఆరేడు నెలల పాటు టీమ్ కు దూరంగా ఉండనున్నారు. పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా బుమ్రా.. వెన్నునొప్పితో బాధపడుతూ ఇటీవలే న్యూజిలాండ్ లో సర్జరీ చేయించుకున్నాడు. ఈ ఇద్దరూ జూన్ లో జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఆడలేరు. ఇక ఈ జాబితాలో తాజాగా అయ్యర్ కూడా చేరుతుండటంతో భారత్ కష్టాలు రెట్టింపవుతున్నాయి.
రాహుల్ రాక తప్పదు..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టులో అయ్యర్ ఆడలేదు. తర్వాత ఢిల్లీ టెస్టులో హడావిడిగా తీసుకొచ్చినా అతడు ఆడలేదు. ఇండోర్ లోనూ అవే ఫలితాలు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్నా జట్టులోకి ఎంపిక చేశారని అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. అయ్యర్ టెస్టు టీమ్ లోకి రావడం, గిల్ ఫామ్ లో ఉండటంతో చివరి రెండు టెస్టులలో టీమ్ మేనేజ్మెంట్ కెఎల్ రాహుల్ కు షాకిచ్చింది. కానీ తాజాగా అయ్యర్ విఫలమవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు రాహుల్ తప్ప భారత్ కు గత్యంతరం లేకుండా పోతోంది. బ్యాటర్ గానే గాక వికెట్ కీపర్ కోటాలో కూడా రాహుల్ కు అవకాశం దక్కే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్ లో చోటు దక్కించుకున్న శ్రీకర్ భరత్.. పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అతడికి మళ్లీ ఛాన్స్ ఇచ్చే సాహసం సెలక్టర్లు చేయకపోవచ్చు.